టీడీపీ నాయకురాలు సాదినేని యామినిపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్

tdp-leader-yamini-sadineni
- Advertisement -

tdp-leader-sadineni-yamini

అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేత సాదినేని యామినీని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నెల్లూరుకు చెందిన గంగినేని శ్రావణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీలో చురుగ్గా ఉండే సాదినేని యామిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనుల గురించి వివరిస్తూనే.. ప్రతిపక్ష నేతలను విమర్శిస్తుంటారు.

కొంతకాలంగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ యామిని తీవ్రంగానే స్పందించారు. ఒక టీవీ చానల్ లైవ్ షోలో యామినీ‌కి, జనసేన పార్టీకి చెందిన ఓ నేత నడుమ తీవ్ర స్థాయిలో వాగ్వాదం కూడా జరిగింది. అయితే.. పవన్ కళ్యాణ్‌ని తరచూ విమర్శిస్తున్నారనే ఉక్రోషంతో యామినీని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టారు.

నెల్లూరుకు చెందిన గంగినేని శ్రావణ్ కుమార్‌ అనే వ్యక్తి యామినీ సాదినేనిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఆమె గురించి దుష్ప్రచారం చేశాడు. దీంతో.. ఆమె అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు చివరికి గంగినేని శ్రావణ్ కుమార్‌ను అరెస్టు చేశారు.

జనసేన పార్టీ నేతలే తనపై ఇలా కావాలని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రాతలు రాయిస్తున్నారని ఈ సందర్భంగా సాదినేని యామిని ఆరోపించారు. తనను కించపరుస్తూ పోస్టింగులు పెట్టే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -