కాలం మారుతోంది సోదరా.. ఓటరు మారుతున్నాడు.. (నాడు-నేడు)

10:14 pm, Thu, 29 November 18
vote 3ff

vote polingస్వాతంత్యం వచ్చి ఇప్పటికి 71 సంవత్సరాలు గడిచింది.. ఐదేళ్ల  చొప్పున లెక్కేస్తే.. ఇప్పటికి 14 నుంచి 16సార్లు ఎన్నికలు జరిగినట్టుగా భావించాలి. ఎందుకంటే మధ్యలో ఇలాగే కేసీఆర్ లాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం..మధ్యలో ఎన్టీఆర్ లాంటి వాళ్లు శాసనసభను రద్దు  చేసి తిరిగి అధికారం చేజిక్కించుకోవడం లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే 16 సార్లు మన ప్రజలు వివిధ పార్టీలకు ఓట్లేసి తీర్పులు చెప్పారు. అలాగే ఆ పార్టీలన్నీ అధికారంలోకి వచ్చి రాజ్యాలు ఏలాయి..

అప్పటికి.. ఇప్పటికి..

నాయకుల తీరులో ఎలా మార్పు వచ్చిందో, ఓటింగు సరళిలో అంటే ఈవీఎంలు రావడం, ఇప్పడు కొత్తగా వీవీ ప్యాట్ లు రావడం.. ఇలా ఎన్నో మార్పులు చూస్తున్నాం. అప్పట్లో ఓటింగ్ పూర్తయి కౌంటింగ్ జరిగేటప్పడు ఒకొక్క ఫలితం తేలాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు అభ్యర్థులు కళ్లల్లో వత్తులు  వేసుకొని చూసేవారు.. ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా మొదలుపెట్టిన గంటలోనే మొత్తం రాష్ట్ర ముఖ చిత్రమే తేలిపోతోంది.

వీటన్నింటినీ చూస్తే మీకేమనిపిస్తోంది..

నాయకులు ఎప్పటిలాగే ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉత్తుత్తి హామీలిస్తున్నారు. అలవి కానివి చేస్తామంటున్నారు. ముందు ఎన్నికల గండం గట్టెక్కితే చాలు..తర్వాత సంగతి చేసుడో..మళ్లీ ఏడ్చుడో.. అనుకుంటూ మాయమాటలు కూడా చెప్పి ప్రజలను మభ్య  పెడుతున్నారు. ఈ క్రమంలో ఒకసారి స్వాతంత్ర్యం వచ్చాక పోలింగ్ సరళి, నాయకుల తీరు.. మారుతున్న అభ్యర్థుల ఓటింగ్ సరళిని , రాబోయే  జనరేషన్ ఆలోచనలను ఒకసారి విశ్లేషిద్దాం..

71 ఏళ్ల క్రితం..

అందరూ ఆనందంగా స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెెస్సోల్లే అనుకుంటూ..వారిని గెలిపించారు. అంటే అప్పుడు ఓటరు  మనసులో ఉత్సాహం ఉంది. ఉత్తేజం ఉంది. మనదేశం మనకొచ్చింది. అనుకుంటూ ఓటేశారు. అంటే అప్పుడూ బలమైన ప్రతిపక్షాలున్నాయి. కానీ ఓటరుని ప్రలోభాలకు గురిచేసే స్థితి నాయకుల్లో లేదు..ఇటు ఆశించేతత్వం ఓటర్లలోనూ లేదు. అంతా ఆదర్శంగానే కాలం నడిచింది. ఓటు అనగానే అదెంతో పవిత్రమైనది.. ఒక సచ్ఛీలుడైన,దేశభక్తి కలిగిన నాయకులకే వేయాలి.. వారే దేశాన్ని పాలించే అర్హత కలవారనుకునేవారు. గెలవడం, ఓడటం ఇది వేరే  సంగతి..తన ఓటు..ఒక మంచి అభ్యర్థికి వేసానా లేదా..ఇదే ఆలోచించేవారు.  ఇలా మూడు ఎన్నికలు అంటే.. ఒక 15ఏళ్లు ఈ తరహాగా సాగాయి..  ఇప్పుడు చూడండి

55 ఏళ్ల క్రితం.. ఎన్నికలంటే..

ఇక్కడే ఒక గమ్మత్తు జరిగింది. అదేమిటంటే చాలామంది దేశం కోసం పోరాడినవాళ్లు.. కాంగ్రెస్ పై అభిమానంతో..ఒకవైపున అలాగే ఉండిపోయారు.. అది చాలాకాలం కాంగ్రెస్ కి బలమైన ఓటు బ్యాంకులా మారిపోయింది. వాళ్ల మనసులో దేశం కోసం ప్రాణాలకు ఒడ్డి పోరాడింది..కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే..వారక్కడ ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టినా ఓటేయాల్సిందే..అన్న ఒక బలమైన విశ్వాసంలోకి వెళ్లిపోయారు. దీంతో వారికి ఒక ఓటు బ్యాంకు వరంలా మారిపోయింది.. ఆ తర్వాత నెహ్రూ తదనంతరం ఇందిరాగాంధీ రావడం..అమ్మగా మారిపోవడం, హస్తం గుర్తుకే  మన ఓటు అనేది మనసుల్లో ముద్రించుకుపోయింది.

ఇది కేవలం ఓటరుకి సంబంధించిన మార్పు మాత్రమే..

ఈక్రమంలో వచ్చి చేరుతున్న పార్టీల గురించి కాదు..అంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జనతాపార్టీ ఆవిర్భవించడం అది వేరే సంగతి.. అంటే ఇది ఓటరు మనస్తత్వం ఎలా ఉండేదో చెప్పే కథనం మాత్రమే.. అంటే ఒకరకంగా ఇక్కడ కాంగ్రెస్ వైపు ఇలా కొంతమంది ఉండిపోవడం..అప్పుడే యువకులుగా ఉన్నవారు ఆదర్శభావాలున్నవారు..మంచీచెడు గ్రహించేవారు కాంగ్రెస్ కి రెండోవైపున నిలుచున్నారు. అంటే మధ్యవయసు, వృద్ధులు ఒకవైపు, యువకులు ఒకవైపుగా విడిపోయారు. ఇలా పదేళ్లు గడిచాయి..

ఇప్పుడు 45 ఏళ్ల ముందు..

ముఖ్యంగా ఓటరు మనస్తత్వంలో చిన్న మార్పు వచ్చింది. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి 25 సంవత్సరాలు గడిచిపోయాయి.కానీ కొన్ని సామాజిక వర్గాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయారు. కొందరు మధ్యతరగతి ప్రజలింకా అణగారిన వర్గాల్లా మారిపోయారు.  ఈ సమయంలో ఎన్నికల్లో కొన్ని సామాజిక వర్గాలకి మాత్రమే..రాత్రిళ్లు కొద్ది మొత్తంలో డబ్బులు పంచేవారు. ఎందుకంటే వారు వెనుకబడి ఉండటం, ఓటుకి డబ్బులు తీసుకోకూడదనే ఆలోచన కూడా లేకపోవడం..ముఖ్యంగా వారు చదువులో వెనుకబడిపోవడం, ఓటు విలువ తెలియకపోవడం..ఇలా సవాలక్ష కారణాలతో వారు డబ్బులు తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు. ఆ ఊరికో లేదా ఆ పేటకో ఒక పెద్ద ఎవరైతే ఉన్నారో వారి మాటపై ఉండిపోవడం, బలమైన నమ్మకాలు కలిగి ఉండటం..అంటే దేవుళ్లు, దేవతలపై ఒట్లు పెట్టించడం..ఇక రాత్రంతా జంప జాతరలా తాగినోళ్లకి తాగినంత, తిన్నోళ్లకి తిన్నంత..ఒక పెద్దోళ ఇంట్లో పెళ్లి ఎలా జరుగుతుందో.. ఈ ఓట్ల పండుగనాడు..పేదోడింట్లో అలా జరిగేది..దానిని పెళ్లి ఫంక్షన్ లాగే వారు భావించేవారు.. శుభ్రంగా ఎంజాయ్ చేసేవారు..పొద్దున్నే పోలింగ్ బూత్ ల దగ్గరకు వెళ్లి.. మాటిచ్చినట్టుగా గుంపగుత్తగా గుద్దేసి వచ్చేసేవారు..

ఇక్కడే ముఖ్యంగా గమనించాల్సింది..

ప్రజాప్రతినిధుల్లో సేవ చేద్దామనుకునేవాళ్లు నెమ్మదిగా తగ్గిపోయి..రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుందాం..తమ వ్యాపారాలు ..చిన్న ఊరి నుంచి పట్టణానికి, అక్కడ నుంచి నగరానికి అక్కడ నుంచి మెట్రో సిటీలకు అక్కడ నుంచి విదేశాలకు విస్తరించుకోవడానికి, తమ నల్లధనంపై అధికారుల దండు మీద పడకుండా ఉండేందుకు, ఇంకా  అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి రాజకీయ పదవిని కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు.

ఈ ట్రెండ్ కొన్నాళ్లు నడిచింది.. 30 ఏళ్లు అనుకుందాం.. అంటే ఇప్పుడు మనం 15 ఏళ్ల క్రితం ఉన్నాం..

వ్యాపారులు..రాజకీయాల్లోకి దాదాపు వచ్చేశారు. ప్రజాసేవ చేసేటోళ్లు నెమ్మదిగా వెనక్కెనక్కి వెళ్లిపోయారు. విలువలనేవి దాదాపు శూన్యమైపోయాయి. మంత్రి పదవులు కూడా వారికే ఇచ్చేస్తున్నారు. కేంద్రంలో అయితే బడా వ్యాపారులు ఏంచెబితే అదే చేస్తున్నారు.  ఇది కూడా ఐదేళ్లు ఒక ఉద్యోగంలా మారిపోయింది. ఉద్యోగులు ఆఫీసులకెళ్లి ఫైల్స్ అవీ ఎలా చూస్తారో..అలాగే ప్రజాపనులకు సంబంధించి సంతకాలు చేయడం, కాంట్రాక్టులుంటే మనకెంత?అని వాటాలేసుకోవడం..కాసేపు అసెంబ్లీలో హడావుడి చేయడం..అంతే డ్యూటీ అయిపోయింది. దీనికి మళ్లీ వీళ్లకు జీతాలు, స్టార్ హోటల్ సౌకర్యాలు, విలాసాలు, కార్ల ర్యాలీల్లా కాన్వాయ్ లు.. ఇన్ని ఇక్కడుంటే వాళ్లెందుకు నియోజకవర్గం వైపు చూస్తారు. ఒకవేళ చూస్తే..ఈ ఏడుపులవీ భరించలేరు. అందుకే కన్నెత్తి కూడా అటు చూడటం లేదు..

అయితే ఇప్పుడివన్నీ ఓటర్లు చూడకుండా ఉంటారా..చూశారు..

అప్పుడేం జరిగిందంటే..వాళ్లూ ట్రెండ్ మార్చారు..ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైన ఓటుకు నోటును  మధ్యతరగతి వారూ అడగడం మొదలుపెట్టారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. చూడండి.. ఒక ఎమ్మెల్యే ఒక ఏరియాలో డబ్బులు పంచడానికి, ఎన్నికల్లో ఖర్చుకి రూ.5 కోట్లు ఖర్చు చేశాడనుకుందాం..అతనెలా లెక్కేసుకుంటాడంటే.. ఆ ప్రకారం అతను ఎలా అవినీతికి ప్లాన్ చేసుకుంటాడు..తన  అవినీతి అంచనాలను ఎలా పెంచేసుకుంటాడో ఒకసారి మీరూ అతి దగ్గరగా అతని మనస్థత్వాన్ని చూడండి.

ఇప్పుడు ఎన్నికల ఖర్చు రూ.5 కోట్లు..

ఐదేళ్ల కాలంలో ఖర్చులు..క్యాడర్ ని మేపడానికి, మెహర్భానీకి.. రూ.5 కోట్లు

వచ్చే ఎన్నికల్లో ఖర్చుకి.. మరో రూ.5 కోట్లు

పిల్లల భవిష్యత్తుకి రూ.5కోట్లు..

తన బంధువర్గాలకి మేలు.. రూ.5 కోట్లు..

వెరసి రూ.25 కోట్ల అవినీతి చేద్దామని ఫిక్స్ అవుతాడు..అంతవరకే ఒక టార్గెట్ పట్టుకొని వెళ్లిపోతాడు. ఎప్పుడైతే మధ్యతరగతివాడు ఎంటరయ్యాడో..ఇక్కడ మన ఎమ్మెల్యేగారి బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక మారుమూల వర్గానికి కొంత మొత్తం ఇస్తే  సరిపోయేది…ఇప్పుడింతమందికివ్వాలంటే మరో రూ.10 కోట్లు కావాలి..అంటే ఇప్పుడు అవినీతి స్థాయి రూ.35 కోట్లకు దాటిపోయింది. దీంతో అవినీతి స్థాయి కూడా పెరిగిపోయింది. అది ప్రజాపనులపై పడి..తిరిగి తిరిగి మళ్లీ పన్నుల రూపంలో ప్రజలపైనే పడుతుంది అది వేరేమాట..

ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎన్నికలకు వస్తే..

చదువుకున్నోడు లేడు..చదువులేనోడు  లేడు..అందరూ కలిసిపోయారు. అందరికీ డబ్బులు కావాలి. అంటే ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇప్పుడందరికీ డబ్బులు పంచాల్సిందే. అంటే ఒక ఎమ్మెల్యే ఖర్చు..సరాసరి రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లకు చేరిపోయింది. అయితే పంచితే మళ్లీ గెలుస్తామా? అన్నది కూడా నేతలని పట్టి పీడిస్తోంది.  ఎందుకంటే రాజకీయనాయకుడికి విలువ లేదు..తను డబ్బులిస్తున్నాడు. అతను నీతిగా వేయమని అడగలేకపోతున్నాడు.

చివరికి ఏం జరిగిందో చూడండి.. ఓటరునే దొంగను చేసేసిన రాజకీయ నేతలు

తన రాజకీయ లబ్ధి కోసం ఓటరుకి అలవాటు చేసి..చేసి..ఇది అందరిలోకి పాకేలా చేసి.. చివరికి  పదవిలోకి వచ్చాక ఓటరునే దొంగను చేసేశారు.  ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రచారం బాగా నడుస్తోంది. ఒకప్పుడు రాజుల కాలంలో చదువుకున్నవాళ్లందరూ కొన్ని శాసనాలు తమకు అనుకూలంగా రాసి పడేసి.. ప్రజలని వర్గాలవారీగా విడగొట్టి.. డబ్బు, అధికారం ఒక దగ్గర పెట్టుకొని సమాజాన్ని ఛిన్నాభిన్నం చేసి.. ఇప్పటికీ ఎవడినీ ఎదగకుండా చేశారని ఒక ప్రచారం ఉంది. అంటే మనుషులందరూ ఒకేలా పుట్టినా..వీరిని కొన్నికొన్ని పనులకి వర్గాలుగా విడదీసి..వారు పొరపాటున అక్కడ పుడితే..ఇక తరతరాలు వారి జీవితం ఎదుగూబొదుగూ లేకుండా చేసేశారు. ఏవైతే రాసే శక్తి ఉన్నవాళ్లున్నారో..అప్పటి పరిస్థితులకనుగుణంగా రాసేశారు. అంటే ఇప్పుడు వారి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రాసినందుకు అందరిలాగే వారూ ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు..అది వేరే సంగతి..

అలాంటిదే ఇది కూడా.. మైండ్ గేమ్ అన్నమాట..

వారక్కడ రాసేసినట్టే.. ఇక్కడ రాజకీయనేతలు కూడా ఓటరు  నుదుటి మీద రాసేశాడు. ఎలాగంటే  తినగ..తినగ..వేము తియ్యగా నుండు లెక్క..  నువ్వు డబ్బులు తీసుకొని ఓటేశావు..నీకెవడురా..గౌరవం ఇస్తాడని. అనడం..  ఇంతకీ వీరేదో పెద్ద  నీతిపరుడిలా కబుర్లు చెబుతూ..ఓటరుని చిన్నబుచ్చుతున్నారు.. పదిమందిలో అవమానిస్తున్నారు.దీనినే ప్రచారం చేస్తున్నారు.  ఇదే మైండ్ గేమ్ అన్నమాట.. ముందు అందరినీ ఒకేమాట పదేపదే అంటూ ట్యూన్ చేస్తుంటారు..   కొన్నిచోట్లయితే గెలిచిన తర్వాత.. కారులోంచి కనీసం చూడనైనా చూడకుండా.. ఎంతో హీనంగా చూస్తూ వెళ్లిపోతుంటారు. కొందరైతే ఏ పనిచేయాలన్నా..నీకు నేను ఓటేయడానికి డబ్బులిచ్చాను..నీకు పనిచేయాలంటే ఆ డబ్బులివ్వు..అంటున్నారు.. కొందరేమో..ఓటరుని పురుగుని చూసినట్టు చూస్తున్నారు. డబ్బుకి లొంగిపోయాడు..ఓటుని అమ్ముకుంటున్నాడు.. దొంగ ఓటరుగాడు..వీరికి విశ్వాసం లేదండి.. వెయ్యిస్తే లొంగిపోతాడు.  అని కామెంట్లు చేస్తుంటాడు.

చూడండి..డబ్బులు తీసుకుని ఓటేస్తాడు..మనల్నే తిరిగి అంటాడు..

డబ్బులు తీసుకొని ఓటేస్తాడు.. మళ్లీ తిరిగి మనల్నే అంటే రాజకీయనాయకులని దొంగలంటాడు. ఊరికినే డబ్బులు చెట్లకి కాస్తున్నాయా? వీళ్లకి డబ్బులివ్వడానికే కదా..  మేం అవినీతి చేస్తున్నదని  భారీ డైలాగులు కొడుతుంటారు. చాలామంది భారీ బహిరంగ సభల్లో ఓటును అమ్ముకోవద్దు..అని ఓటరుపై దుష్ప్రచారం చాలా బాగా చేస్తున్నారు. అసలు ఆ మాటన్న పెద్దమనుషులు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో గెలవమనండి..అంటే ఓటర్లను వారి ముందే దోషులను, వెర్రి బాగులోల్ని చేస్తున్నారు. ఇక్కడ  సమస్యేమిటంటే.. ఇన్నాళ్లూ ఓటరుకి వేదిక లేదు..వారి దగ్గర డబ్బులున్నాయి..వేదికలున్నాయి..ఎన్నయినా మాట్లాడతారు. వాటిని ప్రచారంలో పెడతారు.

రూల్స్ వారు  ప్రజలకు పెడతారు.. అవసరం వస్తే వారే బ్రేక్ చేస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినదే ఇది.. అంటే అర్థం కాలేదా? ఇదెప్పుడో అక్కినేని.. ఒక పాటలో చెప్పాడు కదా.. ‘ఎదుటి మనిషికి చెెప్పేటందుకే నీతులున్నాయి..’ అందుకే  ఇప్పుడు ఓటరు.. ఏమంటున్నాడో తెలుసా.. డోంట్ కేర్ అంటున్నాడు. వారు మాయమాటలు చెప్పడం మానడం లేదు. అందుకనే మేం కూడా మీ దారిలోకే వస్తున్నాం..మీరు మాయ చేసినట్టే మేం చేస్తాం..మీరేం చేసుకుంటారో మీరు చేసుకోండి..మేమేం చేస్తామో మేమూ  చేస్తాం.. అంటున్నారు..

అర్థమైందా..

ఇది ప్రజాస్వామ్యం.. కాలం మారింది..విలువలు మారిపోతున్నాయి. నాయకులను ఏళ్లకు ఏళ్లు  చూస్తూనే ఉన్నారు. వారికీ విలువ లేదు..మనకీ  లేదు..ఎందుకొచ్చిన గొడవ..మనకు నచ్చినోళ్లకే మనం ఓటేసేద్దాం..అని ఫిక్స్ అయిపోతున్నారు..ఇదండీ సంగతి.. ఇటీవల ఒకచోట జరిగిన వార్డు ఎన్నికల్లో ఒక అపార్ట్ మెంట్ వారందరూ రాలేదు. అక్కడ అధికారపార్టీకి డౌట్ వచ్చి కొందరు కార్యకర్తలు పరుగుపరుగున వెళ్లారు. అది చాలా గొప్పవాళ్లున్న అపార్ట్ మెంట్..అందులో అందరూ బాగా విద్యావంతులు, ఉన్నత హోదాల్లో ఉద్యోగాలు చేసినోళ్లు, బడా వ్యాపారులు అందరూ ఉన్నారు. వారంతా కలిసికట్టుగా ఒక మాటనుకొని ఓటింగ్ కి వెళ్లడం మానేశారు. అప్పుడు కార్యకర్తలు గబగబా రెండేసి వేల రూపాయల నోటు.. ఒకొక్క అపార్ట్ మెంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇచ్చి ఆటోలు పెట్టి గబగబా పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకువెళ్లారు. తర్వాత వాళ్లేమన్నారో తెలుసా? అవి మన డబ్బులే కదా.. ఓటు లోపలికెళ్లి ఎవరికేశావో..వాడేమైనా చూసొచ్చాడా.. మాడు మోసగాడైతే..మనం మోసగాళ్లకు మోసగాళ్లం..అంటూ చిరునవ్వు నవ్వారంట..

రాజకీయనాయకులూ  ఆలోచించండి..

అందుకని ఇంకా డబ్బులు ఖర్చు పెడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో చూశారు కదా.. మీ ఓటు..మీరు డబ్బులిచ్చినా మీకే పడుతుందని గ్యారంటీ లేదు..మిమ్మల్ని చూసే వారూ మారిపోయారు. ఒట్లు గిట్లు ఇప్పడు పనిచేయడం లేదు. మందేసి ఆ రాత్రే ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తున్నారు. ఒకప్పటిలా పోలింగ్ బూత్ వరకు ఆ ఒట్టుని నెత్తిమీద పెట్టుకొని తీసుకువెళ్లడం లేదు.  ఇంకా ఇంకా అవినీతి చేసి  దేశాన్ని అవినీతిమయం చేస్తారో..లేదంటే మళ్లీ స్వాతంత్ర్యం వచ్చిన రోజులకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారో నాయకులారా.. మీరే తేల్చుకోండి. అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే..మరో 70 ఏళ్లు  పడుతుంది అనుకోండి కానీ తప్పదు

ఎందుకంటే..  ఇప్పుడు యవతరం వచ్చింది..

అందరూ కాన్వెంటు స్కూళ్లలో, కార్పొరేట్ కాలేజీ్ల్లో చదువుకుంటున్నారు..విదేశాలకు వెళుతున్నారు.. విద్యావంతులవుతున్నారు. వాళ్లేమీ వందకి రెండొందలకి అమ్ముడైపోరు..కాకపోతే వారి ఆలోచనలకు తగినట్టుగా వారి పిల్లలు తయారవుతారు. అప్పుడు భారతదేశం మళ్లీ దానంతటదే మారుతుంది. ఇప్పుడొక తరానికి ఆలోచన వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఎలా ఓటింగు జరుగుతుందో.. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ప్రజలు ప్రజాస్వామ్యానికి ఎంత గౌరవం ఇస్తారో..అవన్నీ మనం వచ్చే  జనరేషన్ లోనే చూడగలం..

అందుకని నాయకుల్లారా..

మీ పిల్లలని మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలంటే మారుతున్న కాలానికి తగినట్టుగా పెంచండి..విలువలు నేర్పండి.. దయచేసి రౌడీల్లా మార్చకండి.. ఎందుకంటే వాడు మీరు కొన్నేళ్లు కోటి..కోటిగా కోట్ల రూపాయలు పెంచిన ఆస్తిని వాడు ఒక్కరోజులో అవగొట్టేస్తాడు. ఎందుకంటే వాడికి డబ్బుల విలువ తెలీదు. ఎంత కష్టపడితే రూపాయి వస్తుందో తెలీదు. ఒక్క ఎమోషన్ లో ఒక గుర్రపు పందాలకో, మలేషియాలో ఒక  ఖరీదైన ‘కాసినో’ కో వెళ్లి ఒక్క రాత్రి గడిపితే చాలు.. తిరిగి రావడానికి విమానానికి టిక్కెట్టు డబ్బులు కూడా ఉండవు.  అదే విలువులున్నవాడిలా చేస్తే.. ఆ వచ్చేజనరేషన్ కి నచ్చుతాడు..

దేశం మారదు..మనుషులే మారతారు..

అందుకని ఇకనుంచి దయచేసి దేశాన్ని విమర్శించకండి.. దేశం మారదు.. మనుషులే మారతారు.  రేపు తెలంగాణలో జరగబోయే..  ఆ తర్వాత ఆంధ్రాలో జరగబోయే ఎన్నికల్లో ఓటేసేటప్పుడు..ఒక్కసారి ఆలోచించి వేయండి..మీకు మేలు చేసే నాయకుడుంటే..అతనికి గెలుపుతో సంబంధం లేదు.. మీ ఓటు విలువైన వ్యక్తి కి వేశామనుకోండి..భువనగిరి నియోజకవర్గంలో ప్రజల కోసం తన ఆస్తులన్నీ అమ్ముకొని..ప్రజల చుట్టూ ఇంకా తిరుగుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి నేతలు ఎందరో ఉన్నారు.వారిని గుర్తించండి.. కులాల వారీగా, ఆ కులాల్లో శాఖలవారీగా, పార్టీలవారీగా, ప్రాంతాలవారీగా విడిపోయి కొట్టుకోకండి..ఈ ఒక్కరోజే..ప్రజలనేవాడు.. వారికి గుర్తుకు వచ్చేది..ఆలోచించండి.. మీ ఓటును  సద్వినయోగం చేసుకోండి. జైహింద్

-శ్రీనివాస్ మిర్తిపాటి