హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సంగ్రామం కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. మరో పది రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు కూడా రంగంలోకి దిగారు. కేంద్రం నుంచి అతిరథ మహారథులూ కదిలి వస్తున్నారు. ఒకవైపు కేంద్రంలో అధికారంలో కొనసాగుతూనే ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోన్న మోడీ-షా ద్వయం ఇప్పటికే ఒక రౌండ్ తెలంగాణకు విచ్చేసి ప్రచారంలో పాల్గొని తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. యూపీఏ అధినేత్రి సోనియా స్వయంగా హైదరాబాద్ సభలో పాల్గొనగా, ఆమె తనయుడు, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం తెలంగాణలో సుడిగాలి పర్యటనలు సాగిస్తూ తమ పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకొస్తున్నారు.
‘సెంటిమెంటు’తో సోనియా…
ఇటు విడివిడిగానూ, అటు టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ కలిసి రాహుల్ గాంధీ ప్రచార సభల్లోనూ, రోడ్ షోల్లోనూ పాల్గొంటున్నారు. సోనియా అయితే తెలంగాణ తల్లిగా తనని తాను అభివర్ణించుకున్నారు. రాజకీయంగా తమకు నష్టం జరుగుతుందని తెలిసినా సరే.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, ‘‘నాలుగేళ్ల తరువాత మళ్లీ నా బిడ్డను చూసుకోవడానికి వచ్చా..’’ అంటూ సెంటిమెంట్ ప్లే చేశారు.
ఆ ఓటు వేసి రుణం తీర్చుకోమని వారు కోరుతున్నారు. నిజానికి ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు పెట్టని కోట. ఆంధ్రాలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని తెలిసినా.. కనీసం తెలంగాణ ప్రజానీకానికైనా తమ పార్టీపై సానుభూతి ఉంటుందని భావించగా, ఆ సానుభూతి కాస్తా కేసీఆర్ తన్నుకుపోయారు.
అయితే కేసీఆర్ పాలనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావించిన కాంగ్రెస్ పెద్దలు తిరిగి తెలంగాణ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. పీపుల్స్ మేనిఫెస్టో అంటూ పలు ప్రజాకర్షక పథకాలు ఎరగా వేసి.. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసి రుణం తీర్చుకోవాలని.. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజానీకం మునుపెన్నడూ చూడని అభివృద్ధిని చూపిస్తామని చెబుతున్నారు.
అన్నీ మావేనంటూ బీజేపీ పెద్దలు…
బీజేపీ పెద్దలు అమిత్ షా, నరేంద్ర మోడీ.. తాము అధికారంలోకి వచ్చినప్పట్నించి తీసుకున్న నిర్ణయాలు, ప్రజాకర్షక పథకాల గురించి ఏకరువు పెట్టారు. జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాలు దగ్గర్నించి మొదలుకొని.. జాతీయ రహదారులు, గృహ రుణాల వరకు అన్నీ తామే ఇస్తున్నామని డప్పు కొట్టేసుకున్నారు.
తెలంగాణలో పెన్షన్ దారులకు కూడా తామిస్తున్న సొమ్ముకే మరికొంత చేర్చి ఇస్తూ.. కేసీఆర్ మొత్తం తానే ఇస్తున్నట్లుగా నమ్మబలుకుతున్నాడని, ఆయన మాయమాటలు నమ్మకండంటూ చేతులు జోడిస్తున్నారు. మరోవైపు నుంచి పరిపూర్ణానంద స్వామీజీ కూడా బీజేపీ తరఫున తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఆయా పార్టీల నుంచి ప్రధాన వక్తలందరూ ఆఘమేఘాలపై వస్తున్నారు.. వెళుతున్నారు.
చక్రం తిప్పుతున్న‘చాణక్య చంద్రబాబు’ …
మరోవైపు ఆంధ్రా నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో చక్రం తిప్పుతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో సంబంధాలు చెడిన నేపథ్యంలో.. తానేంటో, తన శక్తియుక్తులు ఏపాటివో బీజేపీ పెద్దలకు తెలియజెప్పాలని ఆయన నిశ్చయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఎలాగైనా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెక్ చెప్పడం కోసం దేశంలోని బీజేపీయేతర పార్టీలను, నాయకులను ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో కొంతవరకు సక్సెస్ అయిన చంద్రబాబు.. తనను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరిస్తోన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బుద్ధి చెప్పేందుకు నిర్ణయించుకున్నారు.
దీనికోసం టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతమొందించే లక్ష్యంతో.. ప్రజా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించడమే కాక, తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకున్న తరుణంలో స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటూ.. మరింత హీటు పెంచారు.
తెలంగాణలో టీడీపీ నాయకులను నాయానో భయానో తన పార్టీలో చేర్చుకుని.. తెలుగుదేశం పార్టీకి అస్థిత్వం లేకుండా చేసిన కేసీఆర్ ఎదుర్కొనేందకు ఇన్నాళ్లూ తెరవెనుక ఉండి తన తంత్రం నడిపించిన ఆయన.. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో.. తన పార్టీని, వ్యక్తిగతంగా తనను అభిమానించే తెలంగాణ వాసులను ఆకట్టుకోవడం ద్వారా వారి ఓట్లను మహాకూటమివైపు తిప్పి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చావుదెబ్బ తీసేందుకు అదను చూసి నేరుగా తెరపై ప్రత్యక్షమయ్యారు.
చిచ్చర పిడుగులా.. రేవంత్ రెడ్డి
తాను ఆంధ్ర వ్యవహారాలు చూసుకుంటున్నప్పటికీ, సందర్భం వచ్చినప్పుడల్లా.. తన పార్టీని, తనను వ్యక్తిగతంగా కేసీఆర్ తిట్టి పోస్తుండటం కూడా చంద్రబాబు ఆగ్రహానికి ఒక కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో టీ-టీడీపీలో కొనసాగి ఆమధ్య కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న రేవంత్ రెడ్డి.. ఒకరకంగా తన మాజీ బాస్ అయిన.. చంద్రబాబుకు మేలు చేస్తున్నాడనే చెప్పవచ్చు.
కొడంగల్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఢీ అంటే ఢీ అంటూ.. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల రేవంత్‌పై ఐటీ దాడులు కూడా ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని ప్రతి బహిరంగ సభలో, రోడ్ షోలో రేవంత్ చేస్తున్న విమర్శలు తెలంగాణలో కొన్ని వర్గాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
కేసీఆర్.. ఒంటరి పోరాటం!
ఇక తెలంగాణలో మరోమారు అధికారం చేజిక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో హెలీకాప్టర్‌లో.. రోజుకు నాలుగైదు చోట్ల బహిరంగ సభల్లో విపక్షాలను తూర్పారపడుతోన్న టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటిలాగే తనదైన శైలిలో తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు.
వెళ్లిన ప్రతిచోటా దేశంలోనే 24 గంటలపాటు కరెంటు ఇస్తున్న ప్రభుత్వం తమదంటూ కేసీఆర్ ఢంకా బజాయిస్తున్నారు. అలాగే రైతు బంధు పథకం, గర్భిణులకు కేసీఆర్ కిట్లు, మిషన్ కాకతీయ, కంటి వెలుగు.. తదితర పథకాల గురించి ఊదరబెడుతూ తెలంగాణ ప్రజల కళ్ల ముందు మెరుపులు మెరిపిస్తున్నారు. అంతేకాదు, ఈసారి టీఆర్ఎస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురాకపోతే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు.
అంతేకాదు, టీఆర్ఎస్‌ను గెలిపించకపోతే తనకు వచ్చే నష్టమేమీ ఉండదని, నష్టమంతా తెలంగాణ ప్రజానీకానికేనని బెదిరింపు పలుకులు వల్లెవేస్తున్నారు. ప్రస్తుతం సగంలో ఉన్న అభివృద్ధి పనులన్నీ ఆగిపోతాయని, ఆ తరువాత మీ ఇష్టం అంటూ.. అంటూ కేసీఆర్ చెబుతుండడంతో ఎందుకొచ్చిన గొడవ.. మళ్లీ టీఆర్‌ఎస్‌కే గుద్దేస్తే పోలా.. అనుకునే జనాభా క్రమేణా పెరుగుతోంది.
తిట్ల పురాణాలతోనే సరి…
ఇలా అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగడంతో తెలంగాణ ఎన్నికల రణరంగం మరో కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. సభ పెట్టిన ప్రతిచోటా నేతలు పరస్పరం విమర్శలు కురిపించుకుంటూ ప్రజలను అయోమయంలో పడవేస్తున్నారు. ఓటర్లు కూడా ప్రతి పార్టీ సభకు వెళుతూ.. నాయకులు ఇచ్చే హామీలు తమ చెవిన వేసుకుంటూ.. తిట్ల పురాణాలను కూడా శ్రద్ధగా ఆలకిస్తూ.. పోలింగ్ రోజున చూద్దాంలే అనుకుంటూ వెళ్లిపోతున్నారు.
ఇక చివరిగా చెప్పొచ్చేదేమిటంటే.. ఇటు అధికార టీఆర్ఎస్ సభలకూ, అటు ప్రజా కూటమి సభలకూ.. జనం ఒకేలా స్పందిస్తున్నారు. వీళ్లను తిడుతుంటే.. వాళ్లు.. వాళ్లని అంటే వీళ్లు.. బాగానే ఉంది.. చివరికి ఈ ప్రజలందరూ ఎవరికి ఓట్లేస్తారన్నది చిదంబర రహస్యంలా మారింది. కాకపోతే కొంత వరకు కేసీఆర్ కి అవకాశాలు ఉన్నట్టే కనిపిస్తున్నా.. కొన్ని మబ్బులు అడ్డుతగులుతున్నాయి. అవి కారు మబ్బులుగా కమ్ముకోకుండా ఉంటే బయటపడిపోతాడు.
మరోవైపు.. పోనీ ఈసారికి ప్రజాకూటమికి అధికారం అప్పగించి చూద్దామా? అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ 2014 నాటి మ్యానిఫెస్టోలో చెప్పిన కేజీ టు పీజీ, డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు, రుణాల మాఫీ, ఉద్యోగులకు పీఆర్‌సీ.. ఇలాంటివెన్నో ఆగిపోయాయి. ఒకరకంగా.. అంటే హామీలిచ్చేటప్పుడే సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తే ఎన్నికలప్పుడు ఇబ్బంది ఉండదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు నెరవేరని ఈ హామీలనే ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నారు. కేసీఆర్ ఏదైతే భాష వాడుతున్నాడో.. రేవంత్ కూడా అదే భాషతో ఆయనపైనే విరుచుకుపడుతున్నాడు. ఇలా కేసీఆర్ సెల్ఫ్ గోల్ కూడా చేసుకుంటున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ, విద్యార్థి వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వారి వ్యతిరేకత వచ్చిందంటే.. ఇబ్బందులు తప్పవు.
ఇక ఇండిపెండెంటు అభ్యర్థులు పలుచోట్ల ముందంజలో ఉన్నారు. ఈ కుమ్ములాటల్లో ఎందుకొచ్చిన గొడవరా బాబూ.. ఎంచక్కా ప్రజలకు సేవ చేస్తా.. అంటూ భువనగరి నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి వాళ్లకి ఓటేద్దాం అని కూడా కొంతమంది అనుకోవడం వినిపిస్తోంది.
-
– శ్రీనివాస్ మిర్తిపాటి