రేవంత్ రెడ్డి సంచలనం: ప్రచారం ఆపేస్తున్నా.. డీజీపీ వేధిస్తున్నారు.. నన్ను చంపేసి మావోయిస్టులపైకి…

revanth-reddy-shocking-comments-on-dgp
- Advertisement -

revanth-reddy-shocking-comments-on-dgp

కొడంగల్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తన ప్రచారాన్ని మూడు రోజులపాటు ఆయన రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. అంతేకాదు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేందర్ రెడ్డి రాష్ట్ర డీజీపీ అయ్యాక కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు తనకూ వేధింపులు పెరిగాయని ఆరోపించారు.

నిజానికి ఖమ్మం జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి ప్రాంతాల్లో శుక్రవారం జరిగే ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉండగా.. తనకు ప్రాణహాని పొంచి ఉందని, అందుకే తాను ప్రచారానికి వెళ్లడం లేదని ఆయన వెల్లడించారు. తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం స్పందించడం లేదని, అందుకే తాను ఎన్నికల ప్రచారాన్ని ఆపేసుకోవాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి వివరించారు.

తనకు 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ఱంలో కూడా తన పర్యటనలను పోలీసులే అడ్డుకుంటున్నారని, ముందుగానే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆఖరి నిమిషం వరకు అనుమతి ఇవ్వలేమంటూ కుంటిసాకులు చెబుతూ వేధిస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై దాడులు జరిగే అవకాశం ఉండడం, భద్రత కల్పించాల్సిన పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తాను మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

‘‘నన్ను చంపేసి ఆ నేరం మావోయిస్టులపైకి..’’

కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనను అంతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయయని, ఇందుకోసం నక్సల్స్ ఏరివేతలో పాల్గొనే కొంతమంది పోలీసు అధికారులను ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దించారని రేవంత రెడ్డి ఆరోపించారు. తనను చంపేసి.. ఆ నేరాన్ని మావోయిస్టులపైకి నెట్టేసే కుట్రకు తెరలేపారని ఆయన పేర్కొన్నారు.

తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ఇచ్చినప్పటికీ కేసీఆర్ ఒత్తిడితో కేంద్రం తనకు భద్రతను కల్పించడం లేదంటూ రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తెలంగాణ హైకోర్టు తనకు 4 ప్లస్ 4 కేంద్ర బలగాల భద్రతను కల్పించాలని ఆదేశించినా, కేంద్రం ఇప్పటివరకూ స్పందించలేదంటూ మండిపడ్డారు. అందుకే తాను ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకోవలసి వచ్చిందని ఆయన వివరించారు.

చెప్పలేం.. మఫ్టీలో ఉన్న పోలీసులే నాపై దాడి చేయొచ్చు…

గతంలో గద్దర్‌పై జరిగినట్లుగా తనపై కూడా దాడి జరిగే అవకాశాలున్నాయని, మఫ్టీలో ఉన్న పోలీసులే తనపై దాడికి పాల్పడినా ఆశ్చర్యపడనక్కర్లేదని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నక్సల్స్ ఏరివేతలో నిపుణులైన పోలీసులతో తనను అంతమెుందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ధిష్టమైన పథక రచన చేసిందని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రణాళికలను డీజీపీ మహేందర్ రెడ్డి, డీఐజీ ప్రభాకర్‌ రావు అమలు చేస్తున్నారని తెలిపారు.

గతంలో తాను పార్టీ ఫిరాయింపుల గురించి చెప్పానని అది నిజమైందని, ఐటీ, ఈడీ దాడుల గురించి చెప్పానని అది కూడా నిజమైందని అంటూ.. ‘‘ఇప్పుడు కూడా చెప్తున్నా.. నాపై దాడులు జరిగే అవకాశముంది. నేను హైదరాబాద్ నుంచి నా నియోజకవర్గానికి వెళుతున్నా.. దారి మధ్యలో కూడా నాపై దాడి జరిగొచ్చు.. ప్రజలంతా గమనించాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..’’ అంటూ రేవత్ కోరారు.

- Advertisement -