హైదరాబాద్: పాకిస్తాన్‌లో అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని పరామర్శించేందుకు వెళ్లిన నగరానికి చెందిన ఓ వివాహిత అక్కడే చిక్కుకుపోయింది.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి రావడం సాధ్యం కావడంలేదని, ఆమెకు సహాయం చేయాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని శాలిబండకు చెందిన షేక్ ఇజాజ్ మొహియుద్దీన్‌కు పాకిస్తాన్ మహిళ సుమేరా ఫారూఖీతో 2011లో వివాహం జరిగింది. పాకిస్తాన్‌లో అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని పరామర్శించేందుకు ఆమె గత ఏడాది డిసెంబర్ 4న 90 రోజుల వీసాపై అక్కడికి వెళ్లింది. ఆమె వీసా గడువు ఈ ఏడాది మార్చి 3 వరకే ఉంది.
సుమేరాతోపాటు విదేశాల్లో మరికొందరు..
ఈ క్రమంలో ఫిబ్రవరి 27న దుబాయ్ మీదుగా ఢిల్లీ వచ్చే విమానం టికెట్టు కొనుగోలు చేసింది. పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సుమేరా ఫారూఖీ లాహోరులోనే ఉండిపోవాల్సి వచ్చిందని అమ్జదుల్లాఖాన్ వివరించారు.
ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు విదేశాంగ శాఖ అధికారులు సహాయాన్ని అందించాలని ట్విట్టర్ వేదికగా కోరారు. ఈమెతోపాటు విదేశాల్లో చిక్కుకున్న నగరానికి చెందిన మరికొందరిని కూడా కాపాడాలంటూ అమ్జదుల్లాఖాన్ విజ్ఞప్తి చేశారు.








