లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ యూకే దేశంలోని లండన్ నగర వీధుల్లో మారువేషంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని యూకేకు చెందిన ‘ది టెలీగ్రాఫ్’ పత్రిక సంచలన కథనం ప్రచురించింది.
భారతదేశంలో బ్యాంకును నిండా ముంచిన నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ నగరం వెస్ట్‌ఎండ్ లోని 8 మిలియన్ యూరోల విలువైన ఫ్లాట్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని పేర్కొంది. బారు మీసాలు, జుట్టు పెంచి జాకెట్ ధరించి వేషధారణ మార్చినా నీరవ్ మోడీని సులభంగా గుర్తించవచ్చు.
ఇక్కడ స్కాం, అక్కడ విలాసం..
ఆయనపై వచ్చిన ఆరోపణలపై లండన్ విలేఖరి ప్రశ్నించగా, దానిపై సమాధానం చెప్పేందుకు నిరాకరిస్తూ ‘నో కామెంట్’ అంటూ నీరవ్ మోడీ నవ్వేశాడట. నీరవ్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినా అతనిపై యూకే అధికారులు చట్టపరంగా ఇంకా చర్యలు ప్రారంభించలేదని సమాచారం. అంతేకాదు, లండన్‌లో నీరవ్ మోడీ కొత్తగా వజ్రాల వ్యాపారానికి తెర తీసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ముంబై తీరాన రూ.100 కోట్లతో నీరవ్ మోడీ నిర్మించిన ‘రూపణ్య’ బంగళాను శుక్రవారం అధికారులు కూల్చివేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13 వేల కోట్లకు ముంచేసి పరారైన నీరవ్ మోడీ.. నిబంధనలకు విరుద్ధంగా కిహిం బీచ్‌లో బంగళాను నిర్మించినట్టు బాంబే హైకోర్టు ధ్రువీకరించడంతో దాన్ని కూల్చివేశారు.








