పోలీస్ Vs స్టార్స్ క్రికెట్ మ్యాచ్: సెలబ్రిటీలే విన్నర్స్, ఆట పాటలతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం

- Advertisement -

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన హైదరాబాద్ పోలీస్ క్రికెట్ లీగ్ (హెచ్‌పీఎల్) గ్రాండ్ ఫైనల్ విజేతగా సెలబ్రిటీ క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది.  హైదరాబాద్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రెండు నెలలపాటు కొనసాగిన హెచ్‌పీఎల్ గ్రాండ్ ఫైనల్  క్రికెట్ మ్యాచ్‌తో ఆదివారం ఎల్బీ స్డేడియం హోరెత్తిపోయింది.   ఒకవైపు సినీహీరోలు, మరోవైపు రాష్ట్ర పోలీస్ అధికారుల నడుమ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ముఖ్య అతిథిగా హోంమంత్రి  నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.  పోలీస్ క్రికెట్ లీగ్ ఫైనల్ విజేత డీసీపీ సుమతి నాయకత్వంలోని నార్త్‌జోన్ జట్టుతో హీరో నాగార్జున కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ జట్టు తలపడింది.

తొలుత టాస్ గెలిచిన సెలబ్రిటీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 8 ఓవర్లలో 84 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్త్‌జోన్ జట్టు 8 ఓవర్లలో 70 పరుగులు చేసి పరాజయం పాలైంది. దీంతో 14 పరుగుల తేడాతో సెలబ్రిటీ జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు హోంమంత్రి నాయిని బహుమతులు అందించారు. సెలబ్రిటీ జట్టు తరఫున అడిషనల్ డీసీపీ మురళీకృష్ణ ట్రోఫీని అందుకున్నారు.

ఈ మ్యాచ్ సందర్భంగా సినీ హీరోలు నాగార్జున, వెంకటేశ్, సుమన్, అక్కినేని అఖిల్, నాని, అక్కినేని నాగచైతన్య సందడి చేశారు. వెంకటేశ్, నాగార్జున కాసేపు క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించారు.  ఈ సందర్భంగా హోంమంత్రి  నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ పోలీసుల కృషితో నాలుగేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందన్నారు.

హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేది మాట్లాడుతూ ప్రజలతో పోలీసులు మరింత మమేకం అయ్యేందుకు ఇటువంటి క్రికెట్ లీగ్‌లు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.  ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐజీ షికాగోయెల్, తరుణ్‌జోషి, డీఎస్ చౌహాన్, డీసీపీలు సత్యనారాయణ, ఏఆర్ శ్రీనివాస్, సుమతి, రమేశ్, ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -