హైదరాబాద్: నటుడు, మాజీ ఎంపీ దివంగత నందమూరి హరికృష్ణ అంతిమ క్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో గురువారం సాయంత్రం అధికార లాంఛనాలతో ముగిశాయి. హరికృష్ణ చివరిచూపు కోసం నందమూరి అభిమానులు భారీగా తరలి వచ్చారు. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు చివరిసారి కన్నీటి నివాళులర్పించారు.
హరికృష్ణ తనయులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు తమ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హరికృష్ణ చితికి కళ్యాణ్‌రామ్ నిప్పటించారు. తెలంగాణ పోలీసులు హరికృష్ణ గౌరవార్థం గాల్లోకి కాల్పులు జరిపి, సెల్యూట్ చేశారు. ఇక సెలవు అంటూ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ‘రథసారధి’కి అందరూ కడసారి వీడ్కోలు పలికారు.
హరికృష్ణ అంతిమ క్రియలు ముగియడంతో బాధాతప్త హృదయంతో ఒక్కొక్కరు అక్కడ నుంచి బయటకు వస్తున్నారు. తమ అభిమాన నేతను కడసారి చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మహాప్రస్థానం కన్నీటి సంద్రంగా మారింది.
అంతకుముందు మెహదీపట్నంలోని ఇంటి నుంచి బయలుదేరిన హరికృష్ణ అంతిమయాత్ర.. సరోజినిదేవి కంటి ఆసుపత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విష్పర్ వ్యాలీ జంక్షన్, జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానానికి చేరుకుంది.
హరికృష్ణ అంతిమయాత్రలో నందమూరి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, వైవీఎస్ చౌదరి, నారా లోకేశ్, హరికృష్ణ సోదరులు బాలకృష్ణ, జయకృష్ణ ఆయన పాడె మోశారు. దాదాపు గంటన్నరపాటు ఈ అంతిమయాత్ర సాగింది.