హైదరాబాద్: 2007 ఆగస్ట్ 25న హైదరాబాదులో జరిగిన జంటపేలుళ్ల కేసులో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తన తీర్పును వెల్లడించింది. 11 ఏళ్ల క్రితం లుంబినీ పార్క్, కోఠిలోని గోకుల్ ఛాట్‌లో నిమిషాల వ్యవధిలో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో నలభై మందికిపైగా మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులుఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తు జరిపిన సిట్ బృందం తేల్చింది.
ఈ కేసులో నాంపల్లి అదనపు మెట్రో పాలిటన్ జడ్జి మంగళవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై ఆధారాలు లేవని తేల్చింది. దోషులిద్దరికీ వచ్చే సోమవారం శిక్షను ఖరారు చేయనుంది. మొత్తం అయిదుగురు నిందితుల్లో అనీఖ్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్‌లను దోషులుగా, ఫరూఖ్ షఫ్రుద్దీన్, సాధిక్ ఇసార్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
2007 ఆగస్టు 25న…
2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. గోకుల్‌చాట్ వద్ద 32 మంది మరణించగా.. 47 మందికి గాయాలయ్యాయి. లుంబినీపార్క్‌లో 12 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈ కేసులో తుది వాదనలు ఆగస్టు 7న ముగిశాయి. తొలుత కోర్టు తీర్పును ఆగస్టు 27కి వాయిదా వేసింది.
8 మందికి ప్రమేయం…
ఈ పేలుళ్లతో 8 మందికి ప్రమేయం ఉన్నట్లు ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ నిర్ధారించింది. ఈ కేసులో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్టు కాగా, ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ సహా మరో ఇద్దరు ఇక్బాల్ భత్కల్, అమీర్ రెజా ఖాన్ పరారీలో ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ రియాజ్ భత్కల్ పాకిస్తాన్, దుబాయ్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు నిఘా, పలు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పేలుళ్లు జరిగిన రెండేళ్ల తర్వాత నిందితులు పట్టుబడ్డారు.
ఈ జంట పేలుళ్ల కేసులో అరెస్టు అయిన ఐదుగురు ఉగ్రవాదులు చర్లపల్లి జైలులో ఉంటున్నారు. ఆగస్టు 27న దర్యాప్తు అధికారులు.. నిందితులు అనీక్ షఫీక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, సాధిక్ ఇస్రార్ అహ్మద్ షేక్, షర్ఫుద్దీన్ తర్కస్, తారీఖ్ అంజుం హసన్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ కేసులోని ఆధారాలను విశ్లేషించడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొంటూ తీర్పును సెప్టెంబర్ 4కి కోర్టు వాయిదా వేసింది. చివరికి ఈ కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పును ప్రకటిస్తూ ఇద్దరిని దోషులుగా నిర్థారించింది. మంగళవారం కోర్టు తీర్పు నేపథ్యంలో చర్లపల్లి జైలు పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.