హైదరాబాద్: నందమూరి కుటుంబానికి సెంటిమెంట్లు ఎక్కువే. తిథి, నక్షత్రం, వారం, వర్జ్యం, జాతకాలు, ముహూర్తాలు, చేతికి, మెడలోకి వివిధ రకాల హారాలు, రుద్రాక్షలు, పూజలు, హోమాలు, వ్రతాలు అన్నీ చేస్తుంటారు. తండ్రి ఎన్టీఆర్ నుంచే వారికి ఈ సంప్రదాయం వచ్చింది. అందుకే బాలకృష్ణ, హరికృష్ణ సహా ఎన్టీఆర్ వారసులు వివిధ రకాల ఉంగరాలు, మెడలో హారాలు, ముంజేతికి రకరకాల కడియాలు ధరిస్తుంటారు.
ఆయన పుట్టిన కృష్ణా జిల్లా నిమ్మకూరులోనే 20 ఏళ్లు వచ్చేవరకూ గడిపారు. ఆ టైంలో పల్లెటూరి సరదాలన్నీ తీర్చుకునేవారు. అదే సమయంలో ఆవులు, గేదెలు, పాడి పంటలు అంటే బాగా మక్కువ పెంచుకున్నారు. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ కు వెళ్లిపోయినా, వాటిపైన ఇష్టం ఏమాత్రం తగ్గలేదు.
నందమూరి హరికృష్ణకు పశుపక్షాదులంటే మహా ఇష్టం. ఆయన పలు రకాల జంతువులను, పక్షులను పెంచుకుంటూ, వాటితో గడుపుతూ సేదదీరుతుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆయన హైదరాబాద్ లోని తన హోటల్ తో పాటు, నివాసం, నిమ్మకూరులోని నివాసంలోనూ, ఫామ్ హౌస్ లో వివిధ రకాల పక్షులు, కోళ్లు, ఆవులు, గేదెలు, కుందేళ్లు, జంతువులను పెంచుకునేవారు.
వీటితోపాటు హరికృష్ణ ఓ నక్కను కూడా పెంచారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఆధ్యాత్మిక భావనలు, జ్యోతిష్యంపై ఎంతో నమ్మకాన్ని చూపే ఆయన, నిత్యమూ నక్కను చూస్తే మేలు జరుగుతుందని ఓ సిద్ధాంతి చెప్పడంతో, నక్కను తెచ్చి పెంచడం మొదలుపెట్టారు. రోజూ ఉదయాన్నే దాపి ముఖం చూస్తే మంచి జరుగుతుందని కూడా ఆయన నమ్మేవారట.