హైదరాబాద్: నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర మొదలైంది. మెహిదీపట్నంలోని ఆయన ఇంటి నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అంతిమ యాత్ర ఊరేగింపు ప్రారంభమైంది. హరికృష్ణ అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కూడా పాడె పట్టుకున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో ముందు నడిచారు. ‘హరికృష్ణ అమర్ రహే’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అక్కడి నుంచి వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు.
అనంతరం అంతిమయాత్ర వాహనంలో హరికృష్ణ భౌతికకాయం పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిల్చున్నారు. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిలబడ్డారు. టీడీపీ నేతలతో కలసి నారా లోకేష్ వాహనం ముందు నడుస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య, పోలీసు బ్యాండ్ మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే మహాప్రస్థానం వద్దకు చేరుకున్నారు.
ఎన్‌ఎమ్‌డీసీ మెయిన్ రోడ్ మీదుగా అంతిమ యాత్ర కొనసాగుతోంది. అక్కడి నుంచి ముస్తఫా జుయెలర్స్, ఎస్‌డీ హాస్పిటల్, మెహిదీపట్నం, రెతిబౌలి, నానల్ నగర్, టోలిచౌకి ఫ్లయిఓవర్, కేఎఫ్‌సీ, ఆర్చియన్ మార్బుల్స్, షేక్‌పేట్ నాలా, భారత్ పెట్రోల్ పంప్, ఒయాసిస్ స్కూల్, విష్పర్ వాలీ జంక్షన్, అక్కడి నుంచి కుడి వైపు రూట్‌లో జేఆర్‌సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరగనుంది.
జనసంద్రంగా మారిన రోడ్డు…
అంతిమయాత్ర కొనసాగుతున్న రోడ్డు జనసంద్రంగా మారింది. అశేషమైన అభిమానులతో రోడ్లు నిండిపోయాయి. హరికృష్ణ చివరి చూపు కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ అమర్ రహే… జోహార్ హరికృష్ణ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి.
ట్రాఫిక్ ఆంక్షలు, మార్పులు…
హరికృష్ణ అంతిమ యాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగనున్న నేపథ్యంలో అయోధ్య జంక్షన్, మహవీర్ హాస్పిటల్, మసాబ్ ట్యాంక్, ఎన్‌ఎమ్‌డీసీ, ఎస్‌డీ హాస్పిటల్, మెహిదీపట్నం రూట్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని సీపీ తెలిపారు.
ఈ ఏరియాల్లో ట్రాఫిక్ మూవ్‌మెంట్ నెమ్మదిగా ఉంటుందని సీపీ వెల్లడించారు. అంతిమ యాత్ర ఎన్‌ఎమ్‌డీసీ మెయిన్ రోడ్ మీదుగా ముస్తఫా జుయెలర్స్, ఎస్‌డీ హాస్పిటల్, మెహిదీపట్నం, రెతిబౌలి, నానల్ నగర్, టోలిచౌకి ఫ్లయి ఓవర్, కేఎఫ్‌సీ, ఆర్చియన్ మార్బుల్స్, షేక్‌పేట్ నాలా, భారత్ పెట్రోల్ పంప్, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వాలీ జంక్షన్, రైట్ టర్న్, జేఆర్‌సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానం వరకు కొనసాగనుంది.
లక్డీకపూల్ నుంచి మాసాబ్ ట్యాంక్ ద్వారా మెహిదీపట్నం వెళ్లేవాళ్లు.. అయోధ్య జంక్షన్, బజార్ ఘాట్, ఆసిఫ్ నగర్ నుంచి మెహిదీపట్నం చేరుకోవచ్చు. ఇవాళ ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు అయోధ్య జంక్షన్ మీదుగా రోడ్డు ఓపెన్‌లో ఉంటుంది.
పాతబస్తీ నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనదారులు.. పురానాపూల్, హండ్రెడ్ ఫీట్ రోడ్, అత్తాపూర్ మీదుగా చేరుకోవచ్చు. లేదంటే బహదుర్‌పురా, జూపార్క్, శివరాంపల్లి, ఆరామ్ ఘర్ నుంచి రైట్ టర్న్ తీసుకొని అత్తాపూర్ రోడ్డు మీదుగా కూడా గచ్చిబౌలి చేరుకోవచ్చు.
3 గంటల తర్వాత ఎన్‌ఎమ్‌డీసీ, ముస్తఫా జ్యుయెలర్స్, ఎస్‌డీ హాస్పిటల్, మెహిదీపట్నం, రెతిబౌలి, నానల్ నగర్, టోలిచౌకీ ఫ్లయి ఓవర్, కేఎఫ్‌సీ, ఆర్చియాన్ మార్బుల్స్, షేక్‌పేట్ నాలా, భారత్ పెట్రోల్ పంప్, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వాలీ జంక్షన్ ప్రాంతాలకు వాహనదారులు వెళ్లొద్దని సీపీ కోరారు. ఆ రూట్ బదులు మాసాబ్ ట్యాంక్ జంక్షన్ నుంచి రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలి రూట్‌లో వెళ్లొచ్చని తెలిపారు.
1/12 జంక్షన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనదారులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనదారులు ఎన్‌ఎమ్‌డీసీ, హుమాయున్ నగర్ నుంచి కాకుండా వేరే మార్గంలో వెళ్లాలని సీపీ అంజనీ కుమార్ కోరారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్‌ఎమ్‌డీసీ మార్గంలో ఆర్టీసీ బస్సులు తిరగవని, ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు ఆ సమయంలో పిల్లలను బయటికి పంపించకూడదని సీపీ తెలిపారు.