హైదరాబాద్: తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు శుక్రవారం ఉదయం పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఫిలింనగర్‌లోని పోలింగ్ బూత్‌కు చేరుకున్న ఆయన నేరుగా బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.అప్పటికే ఎంతో సేపటినుంచి క్యూలో నిలబడిన ఓటర్లు రాఘవేంద్రరావు చర్యను అడ్డుకున్నారు. ‘‘మేమంతా ఎప్పట్నించో క్యూలో నిల్చుంటే మీరు ఒక్కరే నేరుగా బూత్‌లోకి ఎలా వెళ్తారు?..’’ అంటూ ఆయన్ని నిలదీశారు. దీనిని అవమానంగా భావించిన రాఘవేంద్రరావు ఓటు వేయకుండానే అక్కడ్నించి తిరికి వెళ్లిపోయారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా…
గతంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. దీంతో ఆయన అందరిలాగే క్యూలో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రం ఓటు వేయకుండానే వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తీరును పలువురు తప్పుబడుతున్నారు.క్యూలో రమ్మని అడిగినందుకే అవమానంగా ఫీలయి, చివరికి పవిత్రమైన ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా వెళ్లిపోవడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇది ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
దర్శకేంద్రుడు ఏమన్నారంటే…
అయితే దీనిపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తర్వాత వివరణ ఇచ్చారు. ‘‘క్యూలో నిలబడలేక నేను వెళ్లిపోయానని టీవీలో వచ్చింది. ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది. నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను. క్యూలో ఉన్న ఓటర్లు ఎవరూ నన్ను అభ్యంతరపెట్టలేదు. నేను బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కారం కలిగిన వ్యక్తిని కాను. ఛానల్స్ వార్త వేసేముందు.. దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి వేయండి..’’ అని వ్యాఖ్యానించారు.