కొడంగల్: తెలంగాణలో ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వచ్చింది.
కొడంగల్ నియోజకవర్గంలో గురువారం అర్ధరాత్రి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంచుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుని, వాగ్వాదాలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అలాగే కొన్ని చోట్ల వాహనాల అద్దాలను సైతం ధ్వంసం చేయగా, గుట్టుచప్పుడు కాకుండా ప్రచారం చేస్తున్న వారిని అడ్డుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలు గురువారం అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన కొడంగల్ నియోజకవర్గంలో గురువారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
టీఆర్ఎస్ నేతలు కర్రలు, మద్యం సీసాలను వాహనాల్లో తరలిస్తుండగా ప్రజాకూటమి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోస్గి సమీపంలోని బాహర్ పేట కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి నాలుగు వాహనాల్లో చేరుకున్నారు.
ఆయన వెంట వచ్చిన ఓ వాహనంలో కర్రలు, మద్యం ఉన్నాయంటూ కాంగ్రెస్ నాయకులు అ వాహనాలను అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దీంతో, పోలీసులు ఆ వాహనాలను తనిఖీ చేయగా కర్రలు బయటడ్డాయి. అన్ని వాహనాలను తనిఖీ చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితోపాటు, ఇతర నాయకులు పట్టుబట్టారు. ఇలా దాదాపు రెండు గంటల పాటు ఈ ఉద్రిక్తత కొనసాగగా.. ఎస్పీ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింప జేశారు. కర్రలు లభ్యమైన వాహనాన్ని పోలీసు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.