హైదరాబాద్: భాగ్యనగరంలోని ఎల్బీ సేడియం ఆదివారం సందడిగా మారనుంది. ఈ స్టేడియంలో పోలీస్ అధికారులు, సినీ తారల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. పోలీసులు, ప్రజల మధ్య అనుంబంధాన్ని మరింత పెంచే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు.. హైదరాబాద్ పీపుల్స్ లీగ్(హెచ్‌పీఎల్) పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుతో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, యువ కథనాయకులు నాని, అఖిల్, విజయ్ దేవరకొండ తదితరులు ఆడనున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ప్రజలతో కలిసి క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలన్న లక్ష్యంతో రెండు నెలల క్రితం హెచ్‌పీఎల్ పేరుతో క్రికెట్ పోటీలను ప్రారంభించినట్లు సీపీ పేర్కొన్నారు. జోన్ల వారీగా పోటీలను నిర్వహించగా… ఉత్తరమండలం, పశ్చిమమండలం జట్లు ఫైనల్స్‌కు వచ్చినట్లు తెలపారు. ఈ క్రికెట్ పోటీల్లో ప్రత్యక్షంగా 4 వేల మంది యువకులు పాల్గొనగా 40 వేల మంది తమకు సహకరించారన్నారు.
ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అతిథులుగా డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదీలు వస్తున్నారని, ప్రజలందరూ ఆహ్వానితులేనన్నారు. ఈ సందర్భంగా రూపొందించిన టీజర్‌ను పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు సీపీ(శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్, డీసీపీలు ఎ.ఆర్.శ్రీనివాస, విశ్వప్రసాద్, వి.సత్యనారాయణ, ఎం.రమేష్ పాల్గొన్నారు.