సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌లో పెల్లుబుకుతున్న అసమ్మతి.. గాంధీభవన్ వద్ద ఆత్మహత్యా యత్నం!

protest-at-gandhi-bhavan-1
- Advertisement -

హైదరాబాద్: టిక్కెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేసే కొద్దీ పరిస్థితులు విషమిస్తున్నాయి. ఆశావహులందరూ టిక్కెట్లు తమకే దక్కాలని భావిస్తున్నారు. వారి అనుచరులు సైతం తమ నాయకులకు టిక్కెట్ ఇచ్చితీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. అవసరమైతే బెదిరింపులకు కూడా వెనకాడడం లేదు.

ఈ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ టికెట్ దక్కని కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతలు తమ కార్యకర్తలతో ఆందోళనకు దిగుతున్నారు. శనివారం ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యా యత్నం చేయడం కూడా తీవ్ర కలకలం రేపుతోంది.

తమ నేతకే టిక్కెట్ ఇవ్వాలంటూ…

ఉప్పల్ టికెట్‌ను రాగిడి లక్ష్మారెడ్డికి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు  ఇద్దరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా చెప్పామని లక్ష్మారెడ్డి చెబుతున్నారు.  ‘‘మహాకూటమి లక్ష్యం  మేరకు  టీడీపీకి సీటొస్తే… మనం పని చేయాలి… మనకు సీటొస్తే  టీడీపీ మన కోసం పనిచేస్తోంది..’’ అని  ఆయన పేర్కొన్నారు.

అలాగే మల్కాజ్‌గిరి టికెట్ నందికంటి శ్రీధర్‌కు ఇవ్వాలని, టీజేఎస్‌కు కేటాయించరాదంటూ కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ వర్గీయులు ఆందోళనకు  దిగారు. నకిరేకల్ టికెట్‌ను ప్రసన్న రాజుకు ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళన నిర్వహించారు.

రమేష్ రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ…

మరోవైపు ఖానాపూర్ టికెట్‌ను రమేష్ రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ విషయమై రెండు రోజులుగా  హరినాయక్‌ వర్గీయులు గాంధీ భవన్ ఎదుట దీక్ష చేస్తున్నారు.

వారం రోజుల క్రితం శేరిలింగంపల్లి సీటును  కాంగ్రెస్‌కే ఇవ్వాలని కోరుతూ మాజీ  ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌తో పాటు ఆయన వర్గీయులు  ధర్పా చేసిన సంగతి తెలిసిందే. ఈ సీటును కాంగ్రెస్ పార్టీయే  ఉంచుకోవాలని, భాగస్వామ్య పక్షాలకు కేటాయించకూడదని ఆయన డిమాండ్ చేశారు.  ఈ నిరసనల నేపథ్యంలో గాంధీభవన్ వద్ద భద్రత పెంచాల్సిందిగా ఆ పార్టీ నాయకులు హైదరాబాద్ పోలీసులను కోరారు.

- Advertisement -