
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 73వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. తెలంగాణలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి, సామరస్యాలు వెల్లువిరిస్తున్నాయన్నారు. 2018-19 సంవత్సరానికి 14.85 శాతం స్థూల జాతీయోత్పత్తిలో ముందున్నామన్నారు. ప్రగతి ప్రస్తావాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు.
‘‘కొత్త జోనల్ వ్యవస్థతోనే ఉద్యోగాల కల్పన..’’
గ్రామాలు, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం కొత్త చట్టాలతో సంస్కరణలు మొదలుపెట్టామని, సులభమైన పాలన కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
కొత్త జోనల్ వ్యవస్థతోనే ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశామని, సుపరిపాలన కోసం పాత చట్టాలను మారుస్తున్నామని సీఎం వివరించారు. అంతకముందు.. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని.. అక్కడి సైనిక స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరులైన సైనికులకు నివాళులర్పించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో సీఎం కేసీఆర్ సంతకం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసులు గోల్కొండ కోట పరిసరాల్లో భారీ భద్రతను మొహరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జెండా పండుగ వేదికను ప్రభుత్వం మార్చింది. అంతకుముందు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను .. గోల్కొండ కోటకు మార్చారు. 2014 నుంచి వరుసగా గోల్కొండ కోటలోనే సీఎం జెండాను ఎగురవేస్తున్నారు. గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ మువ్వన్నెల జెండా ఎగరేయడం ఇది ఆరోసారి.








