హైదరాబాద్: కంపెనీ అంటే పెద్ద భవనం, బోలెడంతమంది సిబ్బంది, బోర్డ్ రూమ్, సెక్యూరిటీ.. ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా. అయితే ఇందుకు భిన్నంగా కేవలం ఒకే గదిలో ఏకంగా 114 కంపెనీలు కార్యాకలాపాలను సాగించడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఈ వ్యవహారం ఎక్కడో కాదు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ మాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది.
వివరాల్లోకి వెళితే… జూబ్లీహిల్స్‌లోని ఫార్చూన్ మొనార్క్ మాల్‌లోని మూడో ఫ్లోర్‌లో ఓ చిరునామాను వెతుక్కుంటూ వెళ్లిన ఎనిమిది మంది అధికారుల బృందానికి అక్కడి వ్యవహారం చూసి షాక్ కొట్టినట్లయింది. మూడో ఫ్లోర్‌లోని ఓ గది చిరునామాతో 114 కంపెనీలు ఉన్నట్లు తేలింది. అంతేకాదు, వీటిలో కనీసం 50 కంపెనీలు ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్ల నష్టం చూపుతున్నాయి.
కంపెనీల నడుమ కేవలం నగదును సరఫరా చేసేందుకే ఏర్పాటైన షెల్ కంపెనీలుగా వీటిని భావిస్తున్నారు. ఈ కంపెనీలకు వ్యవసాయ భూములు వంటి ఆస్తులున్నాయని, ఆదాయపన్ను రిటర్నులు కూడా దాఖలు చేస్తున్నాయని అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఈ కంపెనీల డైరెక్టర్లు వేతనాలు కూడా తీసుకుంటున్నారు.
ఒక్కో డైరెక్టర్ 25 నుంచి 30 కంపెనీలను నడిపిస్తుండడం విశేషం. నిజానికి ఒక వ్యక్తి 20 కంపెనీలకు మించి డైరెక్టర్‌గా వ్యవహరించరాదని నిబంధనలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకే చిరునామాపై 25కి మించి కంపెనీలు నడిచే ప్రాంతాలపై నిఘా పెట్టాలని ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకే అధికారులు ఫార్చూన్ మొనార్క్ మాల్‌లో తనిఖీలకు వచ్చినట్లు తెలుస్తోంది. కొసమెరుపు ఏమిటంటే… ఈ కంపెనీలన్నింటికీ ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్ అడ్వైజరీ సర్వీస్ అనే సంస్థే అకౌంటెంట్‌గా వ్యవహరించడం.