ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ విజయం దిశగా దూసుకుపోతోంది. పాక్‌లో మొత్తం 272 స్థానాలకు ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్పా ర్టీ 120 స్థానాల్లో, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్( పీఎంఎల్ఎన్) పార్టీ 61 స్థానాల్లో, బేనజీర్ భుట్టో కుమారుడి నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 40 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. దాదాపు 80 శాతం కౌంటింగ్ పూర్తయిందని తెలుస్తోంది.
బుధవారమే పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు.
ఈ ఎన్నికల్లో 30కి పైగా పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. జాతీయ అసెంబ్లీలోని 272 సాధారణ స్థానాలకు 3,459 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పంజాబ్, సింధ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సుల్లో 577 సాధారణ స్థానాలకు 8,396 మంది పోటీ పడ్డారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించింది.
హింసాత్మకం, పలువురి మృతి…
బుధవారం పోలింగ్ సందర్భంగా పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో హిసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై దాడి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా పార్టీ అభ్యర్థులు పలువురు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. హింసాత్మక సంఘటనల మధ్యనే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలయిన కొద్ది గంటలకే ఐసిస్ ఆత్మాహుతి బాంబర్ ఒకరు బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలోని భోసామండి ప్రాంతంలో పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో పోలీసులు సహా 31 మంది మరణించారు. ఇంకా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో మరికొందరు మరణించారు.
హఫీజ్ సయీద్‌కు గట్టి షాక్…
ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ ఓటర్లు షాకిచ్చారు. ఆయన మద్దతిచ్చిన అల్లాహో అక్బర్ తెహ్రిక్ (ఏఏటీ) పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. అల్లాహో అక్బర్ తెహ్రిక్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అయితే హఫీజ్ సయీద్ మద్దతుదారులుగా చెప్పుకున్న కొందరు స్వతంత్రులు మాత్రం గెలిచారు.
ఇమ్రాన్‌కు క్రికెటర్ల మద్దతు…
ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే దాదాపు అన్ని స్థానాల్లో ఫలితాల సరళి తేలిపోయింది. ఇటీవల ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడే వరకు అధికారంలో ఉన్న పీఎంఎల్‌ఎన్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెటర్లు పలువురు ఇమ్రాన్ ఖాన్‌కు తమ మద్దతు తెలుపుతున్నారు.
ఇమ్రాన్‌కు శిక్ష పడే ప్రమాదం?
పోలింగ్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ వేసిన ఓటు ప్రత్యక్ష ప్రసారం కావడంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వెంటనే ఆయనను పిలిచి వివరణ కోరింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన ఓటును రద్దు చేసే అవకాశముంది. ఓటు హక్కును రహస్యంగా వినియోగించుకోకుంటే ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించే ప్రమాదం కూడా ఉంది. పీఎంఎ-ల్ఎన్ పార్టీ అధినేత షాబాజ్ షరీఫ్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడటాన్ని కూడా ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
విపక్షాల విమర్శలు…
మరోవైపు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పీఎంఎ-ల్ఎన్ నేతలు ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై కూడా ఆ పార్టీ విమర్శలు గుప్పించింది. రిగ్గింగ్ జరిగిందని ఆరోపించింది. ఈ ఎన్నికల ఫలితాలను తాము ఒప్పుకునేది లేదని చెప్పింది. దీంతో ఫలితాల సరళి ఆలస్యమవుతోంది. అయితే ఈ ఆరోపణలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సర్దార్ ముహమ్మద్ రజా కొట్టిపారేశారు. కొన్ని సాంకేతిక ఇబ్బందులు మినహా ఈ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా జరిపించామని ఆయన పేర్కొన్నారు.
హంగ్ దిశగా…
ప్రభుత్వం ఏర్పాటుకు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి పదిహేను నుంచి ఇరవై స్థానాలు తక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేజిగ్ ఫిగర్ 172 సీట్లు సాధించిన పార్టీ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో అధికారం పీఠం అధిరోహించనుంది. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు ఏ పార్టీ చేరుకోని పరిస్థితి ఏర్పడటంతో పీపీపీ మద్దతు కోరాలని ఇమ్రాన్ ఖాన్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేదంటే ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ ‘కింగ్ మేకర్’గా మారే అవకాశం కనిపిస్తోంది.