వాషింగ్టన్: ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని రేపు రాత్రి వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం మనదేశంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి (27న) 10.44 నిముషాలకు మొదలై శనివారం (28న) తెల్లవారుజామున 4.58 నిముషాలకు ముగియనుంది. వివిధ దశలు దాటే ఈ ప్రక్రియ మొత్తం 6 గంటలకుపైగానే సాగనుంది.
శుక్రవారం రాత్రి మొదలుకొని.. శనివారం తెల్లవారుజాము వరకు మొత్తం 103 నిముషాలపాటు ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట నుంచి 2 గంటల 43 నిషాల మధ్యలో చంద్రగ్రహణం ఉచ్ఛదశకు చేరుతుంది. ఈ సమయంలో చంద్రుడు ముదురు ఎరుపులో కనిపిస్తాడు. దీనినే ‘బ్లడ్ మూన్’గా అభివర్ణిస్తున్నారు.
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరసలోకి రావడం వల్ల ఇది జరుగుతుంది. సూర్యుడి కిరణాలు భూమిపై ప్రసరించి అతికొద్ది మొత్తంలో చంద్రుడిని చేరడంతో చంద్రుడు రుధిర వర్ణంలోకి మారతాడు. ఇదే సమయంలో అంగారక గ్రహం కూడా మన కంట పడనుంది. సంపూర్ణ చంద్రగ్రహణంలో సూర్యుడి ప్రత్యక్ష కిరణాలు భూమి అంచుల నుండి చంద్రుడిపై పడతాయి. అప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. మళ్లీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోవాలంటే మరో 105 ఏళ్లు అంటే 2123 జూన్ 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికాల్లోని ప్రజలకు ‘బ్లడ్ మూన్’ కనువిందు చేయనుంది. ఉత్తర అమెరికా ప్రజలకు శుక్రవారం పగలు అయినందున అక్కడి ప్రజలకు ఇది కనిపించే అవకాశాలు లేవు. ఆయా దేశాల కాలమానాలను బట్టి ఈ ‘బ్లడ్ మూన్’ ఎంత స్పష్టంగా కనపడుతుందనేది ఆధారపడి ఉంది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియా దేశాల్లో కొంత ఆలస్యంగా శనివారం తెల్లవారుజామున, మిగతా చోట్ల శుక్రవారం రాత్రి కొంతసేపు చంద్రుడు రుధిర వర్ణంలో కనిపిస్తాడని, మిగిలిన ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అంటార్కిటికా అంతటా యావత్ గ్రహణ దశలు వీక్షించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ‘బ్లడ్ మూన్’ను వీక్షించేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు, అద్దాలు అవసరం లేదు. అయితే ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటేనే ఈ గ్రహణం స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. విశేషం ఏమిటంటే.. శుక్రవారం రాత్రి అంగారక గ్రహం (మార్స్) కూడా చంద్రుడికి అత్యంత సమీపంలో కనిపించనుంది. ఈ గ్రహం మామూలుగానే మన కంటికి కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.
రేపు భూమి అంతం!?
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ‘బ్లడ్ మూన్’ను తిలకిద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. మరోవైపు ఈ శుక్రవారమే ప్రళయం సంభవించనుందని, ఫలితంగా భూమి అంతం కానుందంటూ మరికొందరు హడలెత్తిపోతున్నారు. బ్లడ్‌మూన్‌తో పాటుగా అంగారక గ్రహం కనిపిస్తే విపత్కర పరిస్థితులు సంభవిస్తాయని మన పూర్వీకులు విశ్వసించేవారు. అయితే, అది నిజమేనని ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు. దీంతో శుక్రవారం ప్రళయం సంభవించడం ఖాయమని వారు అంటున్నారు.
అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. 2003లో కూడా ఇలాగే అంగారక గ్రహం ఆకాశంలో కనిపించిందని, అప్పుడేం జరగనిది ఇప్పుడు జరుగుతుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. 2003లో అంగారక గ్రహం కనిపించినప్పుడు భూమికి, అంగారకుడికి మధ్య దూరం 56 మిలియన్ కిలోమీటర్లని చెప్పారు. అయితే గతంలో కనిపించినదానికంటే కూడా శుక్రవారం రాత్రి అంగారక గ్రహం అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.