ఏపీకి తుపాన్ల శాపం! వరుణ దేవా.. మా రాష్ట్రంపై ఎందుకీ పగ?

lot of cyclones attack andhrapradesh
- Advertisement -

అమరావతి: మన రాష్ట్రంలో వరుసగా వచ్చిన తుఫాన్ల వల్ల ఎంతో నష్టపోయాం. వచ్చిన ప్రతి తుఫాను ఏదో ఒక తీరాన్ని తీవ్ర నష్టానికి గురి చేస్తుంది. నాటి దివిసీమ ఉప్పెన నుండి నిన్నటి తిథ్లీ వరకూ మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన ప్రజలు పడిన కష్టాలని చెప్పడానికి మాటలూ.. రాయడానికి రాతలూ సరిపోవెమో..

Related image

శవాల దిబ్బని మిగిల్చిన దివిసీమ..

సుమారు 40 ఏళ్ల క్రితం వచ్చిన దివిసీమ ఉప్పెన దివిసీమ ప్రాంతాన్ని శవాల దిబ్బగా మార్చేసింది. ఎటు చూసినా శవాలే… అన్నం లేక అలమటించిన చిన్నారులు.. కన్న కొడుకుల శవాల కోసం కన్నీటితో వెతికిన కన్నతల్లులు.. బిడ్డలెక్కడున్నారో తెలియక తీరం వెంబడి వెతుకులాడిన తల్లిదండ్రులు.. కడుపు నింపే కొడుకు కళ్ల ముందే కడతేరిపోతే తల్లడిల్లిపోయిన కన్నపేగు.. ఆ వైనం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకోని వారుండరంటే  అతిశయోక్తి లేదు. తెరపై నటించే తారలే వారి కన్నీళ్ళకి కరిగిపోయి యావత్ సినీ ప్రపంచం తరలి వచ్చి జోలె పట్టి భిక్షాటన చేసి శరణార్ధులను ఆదరించారు.

Image result for hudhud

దడ పుట్టించిన హుద్‌హుద్..

ఇక మధ్యలో ఎన్నో తుఫాన్లు వచ్చి ముంచి వెళ్ళాయి కానీ..,  ఈమధ్య వచ్చిన హుద్‌హుద్ తుఫాను సృష్టించిన భీభత్సం దివిసీమ ఉప్పెనని తలపింపచేసింది.  హుద్‌హుద్ కారణంగా వైజాగ్‌కి జరిగిన ఘోర నష్టాన్ని మర్చిపోగలమా.. కరెంటు స్థంభాలు పడిపోవడం, షో రూమ్‌లో పై అంతస్థుల్లో ఉన్న కార్లు సైతం పడిపోవడం, వందల ఏళ్ల నాటి చెట్లు కూకటి వేళ్ళతో సహా కూలిపోవడం, బిల్డింగులు కుప్పకూలిపోవడం, ఎక్కడి జనం అక్కడ నిలిచి పోవడం, రహదార్లు కన్నీటి సంద్రం అవ్వడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్ట-నష్టాలు..

గడగడ లాడించిన గజ- పెథాయ్

హుద్‌హుద్ నుండి ఎలాగోలా కోలుకుంటున్న సమయంలో మరో ప్రమాదం ‘గజ’ తుఫాను గజగజలాడించింది.  దాన్ని తట్టుకుని నిలబడే లోపే మరో ముప్పు పెథాయ్ రూపంలో వచ్చిపడింది.. ఏ తుఫాను వచ్చినా ముందు నష్టపోయేది రైతాంగమే. ఇక ఈ పెథాయ్ అయితే అటు ఆంధ్రా, ఇటు తెలంగాణా రెండు రాష్ట్రాల్లోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చి కన్నీటి సంద్రాన్ని చేసింది.

Image result for titli cyclone

భీభత్సం సృష్టించిన తిథ్లీ…

పెథాయ్ ముప్పు నుండి తెరుకునే లోపే నేనున్నాంటూ తొత్తరగా వచ్చేసింది తిథ్లీ.. వైజాగ్‌లోని హుద్‌హుద్‌ని గుర్తు చేస్తూ తిథ్లీ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఆకలితో అలమటించిన జనం, కన్నీరు కార్చిన రైతన్నలు, ఇళ్ల కప్పులు లేచి పోయి నిలువ నీడ లేని వైనం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. మమకారం తప్ప అహంకారం ఎరుగని శ్రీకాకుళం జిల్లా వాసులు పడిన కష్టాన్ని మనం చెరిపెయ్యగలమా…

ఇన్ని చెడు జ్ఞాపకాల సరసన నేనూ నిలబడతానంటూ వచ్చిన ‘ఫణి’ తుఫాను మరి ఏ విధంగా తన రూపం చూపించబోతోందో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు.

తెలుగోడికి వరుణదేవుడి శాపం…

మన తెలుగు రాష్ట్రాలంటే వరుణ దేవుడికి కోపమో ఏమో తుఫాన్ రూపంలో శపిస్తూనే వస్తున్నాడు. గడిచిన 125 ఏళ్లల్లో మన రాష్ట్రానికి కనీసం 80కి పైగా తుఫాన్లు వచ్చి ముప్పు తిప్పలు పెట్టాయి. వచ్చిన ప్రతి తుఫాను ఎన్నో జీవితాలను అల్లకల్లోలం చేశాయి.. నీరు పేదల పాలిట శాపంగా మారి రైతన్నల కష్టంపై కన్నీటి సంతకాలు చేసి నష్టాలనే చెరగని సాక్ష్యాలుగా మార్చి వీడుకోలు చెప్పి వెళ్లిపోయాయి.

భారీ ఆస్థి నష్టం.. ప్రాణ నష్టం.. జరిగింది కానీ.., తెలుగోడు ‘గోడు’ దేవుడుకి వినపడలేదేమో… లేక  ‘ఎన్ని తుఫాన్లు వచ్చినా.., మరెన్ని ముప్పులు పొంచి ఉన్నా కష్ట-నష్టాలకి లొంగిపోడు.. ధైర్యంగానే ఎదుర్కొంటాడు.. ప్రతి సారి ప్రకృతి విసిరే సవాలుకి ఎదురెడ్డి జీవితాన్ని నెట్టుకుని వస్తున్నాడు.’ కదా అని వినపడినా వినపడనట్టు నటిస్తున్నాడేమో..

దేవుడు శపించినా.., ప్రకృతి వికృత రూపం దాల్చినా.. మౌనంగా  ఎదుర్కొంటున్న తెలుగు వారిని చూసి ఇకనైనా వరుణుడు కరుణ చూపిస్తే బాగుండు.. ‘ఫణి’ ప్రభావాన్ని తగ్గించి.., విడిచిపోయిన తుఫాన్ల జ్ఞాపకాలను మళ్ళీ మననం చేసుకునే అవకాశం రాకూడదని వేడుకుంటూ.. ఫణి తుఫాను వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం..

చదవండి: ఉత్తరాంధ్రకు సమీపంలో ఫోని! శ్రీకాకుళం జిల్లాకి పొంచి ఉన్న పెనుముప్పు !

 
- Advertisement -