

న్యూఢిల్లీ: శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు.. బిందు, కనకదుర్గ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని.. పోలీసు రక్షణ కల్పించాలంటూ వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం దానిపై శుక్రవారం విచారణ జరపనుంది.
ఈనెల 2న అయ్యప్ప స్వామి ఆలయాన్ని బిందు, కనకదుర్గ దర్శించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై హిందూ సంఘాలు ఒక్కసారిగా మండిపడ్డాయి. ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలపై దాడి చేస్తామంటూ అయ్యప్ప భక్తులు ప్రకటించడంతో బిందు, కనకదుర్గ కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కనకదుర్గపై అత్త దాడి….
కేరళ ప్రభుత్వ సహాయంతో అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన కనకదుర్గ వారం రోజుల తర్వాత మంగళవారం ఉదయం తిరిగి తన అత్తగారింటికి వచ్చింది. కనకదుర్గను చూడగానే ఆమె అత్త అగ్గిమీద గుగ్గిలమైంది. హిందూ సంప్రదాయాలను మంటగలిపావంటూ స్వయంగా ఆమె అత్తే ఆమెపై దాడి చేసింది.
కర్రతో తలపై కొట్టడంతో కనకదుర్గ తీవ్రంగా గాయపడింది. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను మలాప్పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దీనిపై బిందు మాట్లాడుతూ.. ‘‘ఇది కనకదుర్గ కుటుంబ వ్యవహారం. నిజానికి ఆమె శబరిమల ఆలయానికి వెళ్లడం ఆమె భర్తకు కూడా ఇష్టం లేదు. కానీ ఇప్పుడైతే ఆయన ఆమెకు మద్దతుగానే ఉన్నారు..’’ అని చెప్పారు.
న్యాయ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోన్న బిందు అజ్ఞాతంలోంచి బయటికొచ్చిన అనంతరం తిరిగి తన విధుల్లో చేరారు. కళాశాలలోని విద్యార్థులు, సహోద్యోగులు అందరూ తనకు ఎప్పటిలాగే సహకరిస్తున్నారని, వారి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె తెలిపారు.
భద్రత కల్పించాలంటూ…
అయితే హిందూ సంస్థల కార్యకర్తల నుంచి ముప్పు పొంచి ఉందని భావించిన వారు.. ఈ నేపథ్యంలో తమపై మళ్లీ దాడి జరిగే అవకాశం ఉందని భావిస్తున్న వీరిద్దరూ తమకు భద్రత కల్పించాలంటూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.








