

హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో సాగుతున్న అసత్యప్రచారంపై యావత్ మహిళాలోకం సోషల్ మీడియా వేదికగానే పోరాటం చేయాలని టీపీసీసీ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. షర్మిల పడుతున్న ఆవేదన.. సమాజంలో మహిళల దుస్థితికి అద్దం పడుతుందని ఆమె తెలిపారు.
మహిళా సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా విషం కక్కుతున్న ఈ నీచ సంస్కృతిని నియంత్రించాల్సిన అవసరముందని ఓ ప్రకటనలో విజయశాంతి పేర్కొన్నారు. అంతేకాదు, రాజకీయాల్లో మహిళలను అణగదొక్కుతూ, వేధింపులకు గురిచేస్తూ.. పురుషాధిక్యత చాటుకునే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయన్నారు.
మహిళా లోకం పోరాటం చేయాలి…
ఈ తరహా ఘటనలు మహిళలను మానసికంగా మరింత కుంగదీస్తాయని, షర్మిలకు న్యాయం జరిగే విషయంలో పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకునే విధంగా యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు.
40 ఏళ్లుగా.. సినిమా, రాజకీయ రంగాల్లో మహిళా సాధికారత కోసం పోరాడిన వ్యక్తిగా తాను తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.








