

హైదరాబాద్/అమరావతి: ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ మాజీ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కలిసి రావాలని జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ కోరడం, ఆయన ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం విధితమే. అంతకుముందు కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటం గమనార్హం.
త్వరలోనే కేసీఆర్.. ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని కేటీఆర్ భేటీ అనంతరం తెలిపారు. కాగా, ఈ నేపథ్యంలో మరో కొత్త వార్త బయటికి వచ్చింది. అదేమంటే.. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ను జగన్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారట.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ తన మకాంను అమరావతికి మారుస్తున్నారు. ఆయన కట్టుకుంటున్న ఇల్లు నిర్మాణం పూర్తికావచ్చింది. దీంతో ఫిబ్రవరి 14న మంచిరోజు కావడంతో ఆరోజే గృహప్రవేశం చేయాలని అనుకుంటున్నారట.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ను జగన్ ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలిసింది. జగన్ ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్ అమరావతికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రాజకీయ వేడి చోటు చేసుకోనుంది. తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకున్న చంద్రబాబు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.








