23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అభినందన్ తల్లిదండ్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం: వాఘాకు ప్రయాణం

అభినందన్ తల్లిదండ్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం: వాఘాకు ప్రయాణం

abhinandan varthaman
- Advertisement -

abhinandan parents

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ సైన్యం నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్‌ అభినందన్‌ వర్దమాన్‌ శుక్రవారం స్వదేశానికి తిరిగిరానున్నారు. అభినందన్‌ తిరిగి స్వదేశానికి రానుండడం పట్ల దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో తమ కన్న బిడ్డను చూసేందుకు అభినందన్‌ తల్లిదండ్రులు విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌ వర్ధమాన్‌, శోభా వర్ధమాన్‌, ఇతర కుటుంబసభ్యులు చెన్నై నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి గురువారం రాత్రి చేరుకున్నారు.

ఢిల్లీలో అభినందన్ తల్లిదండ్రులకు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి వారు వాఘా సరిహద్దుకు చేరుకుంటారు. పాక్ నుంచి విడుదలైన తమ కుమారుడ్ని అక్కడే కలుసుకోనున్నారు. కాగా, అభినందన్‌కు స్వాగతం పలికేందుకు భారీ ప్రజలు వాఘా సరిహద్దుకు చేరుకుంటుండటం గమనార్హం.

విమానంలో గౌరవసూచకంగా లేచి నిల్చున్న ప్రయాణికులు

కాగా, అంతకుముందు.. కరతాళధ్వనుల మధ్య అభినందన్ తల్లిదండ్రులను విమానంలోకి ఆహ్వానించారు మిగితా ప్రయాణికులు. గౌరవ సూచకంగా లేచి నిలబడి స్వాగతం పలికారు. వారితో ఫొటోలు తీసుకోవడానికి పోటీపడ్డారు. పాక్ నిర్బంధంలో ఉన్నప్పటికీ అభినందన్‌‌ చూపిన ధైర్య సాహసాలను ఈ సందర్భంగా ప్రయాణికులు గుర్తు చేసుకున్నారు.

తమ కుమారుడు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడని.. అతన్ని చూసి గర్వపడుతున్నానని అభినందన్‌ తండ్రి ప్రకటించిన విషయం తెలిసిందే. తమ అదుపులో ఉన్న భారత కమాండర్‌ను శుక్రవారం విడుదల చేస్తామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత భూభాగంలోకి బుధవారం చొచ్చుకొచ్చిన పాక్‌ యుద్ధ విమానాలను తిప్పికొట్టడంలో భాగంగా అభినందన్‌ నడుపుతున్న మిగ్‌ 21బైసన్‌.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో కూలింది. అయితే, పారాచూట్ ద్వారా సురక్షితంగా కిందకు దిగిన అభినందన్ పాక్‌ ఆర్మీ చేతికి చిక్కారు. రెండ్రోజులపాటు పాక్ ఆధీనంలో ఉన్న అభినందన్‌ను శుక్రవారం విడిచిపెడతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: ‘పాక్ ఎఫ్-16ని కూల్చేశాం, మెరుపుదాడులతో జైషేకు భారీ నష్టం’: పాక్‌కి బుద్ధి చెబుతామన్న త్రివిధ దళాధికారులు

- Advertisement -