ఢిల్లీ: ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ…మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నాయనమ్మ, తండ్రిపై ఆరోపణలు గుప్పించడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం సాయంత్రం ఉజ్జయినిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ…. తాను మోడీ తల్లిదండ్రులను అవమానించాల్సిన పరిస్థితే వస్తే, వారిని అవమానించనని, దానికంటే చనిపోవడానికే ఇష్టపడతానని చెప్పారు.
చదవండి: మోడీ మబ్బు మాటలపై ప్రియాంకా సెటైర్లు…
అయినా ద్వేషాన్ని చూపించేందుకు తానేమీ బీజేపీ, ఆరెస్సెస్ నుంచి రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ, బీజేపీని ప్రేమతోనే మట్టి కరిపిస్తుందన్నారు.
ఇక ప్రధాని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూపై కూడా రాహుల్ సెటైర్లు వేశారు. మోడీ వాస్తవ అంశాలను పక్కనబెట్టి మామిడ పండ్లు, మేఘాల గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. అయినా మామిడి పండ్లు ఎలా తినాలో చెబుతారు కానీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలో తెలియదని అన్నారు.








