భారత వైమానిక దాడిని పాకిస్తాన్ ఎందుకు అడ్డుకోలేకపోయింది!?

Air Strike on Pakistan, Newsxpressonline

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి, బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడిని పాకిస్తాన్ ఎందుకు అడ్డుకోలేకపోయింది? సరిహద్దులు దాటుకుని వెళ్లి పాక్ భూభాగంలో బాంబుల వర్షం కురిపిస్తుంటే పాక్ సైన్యం ఎందుకు గుర్తించలేకపోయింది? భారత యుద్ధ విమానాలను అడ్డుకునే సామర్థ్యం.. పాకిస్తాన్ వైమానిక దళానికి లేదా?

భారత వాయుసేన తమ భూభాగంలోకి అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా 1000 కిలోల బాంబులు వేయడంపై పాకిస్తాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. అసలు భారత యుద్ధ విమానాలు సరిహద్దులు దాటుకుని మన భూభూగంలోకి ఎలా ప్రవేశించగలిగాయి? మన ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తోంది? అంటూ ఏకంగా ఓ పాకిస్తాన్ పౌరుడు ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడంటే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ స్ట్రయిక్ విషయంలో పాకిస్తాన్ ఎంత ఘోరంగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చు.

గతంలో భారత ఆర్మీ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేశామని భారత్ ప్రకటించినప్పుడు దాన్ని పాకిస్తాన్ కొట్టిపారేసింది. కానీ మొన్నటి ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రయిక్ జరిపినప్పుడు మాత్రం.. ‘అవును.. నిజమే.. భారత యుద్ధవిమానాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించాయంటూ స్వయంగా అంగీకరించింది. దీంతో భారత యుద్ధ విమానాలను ఎందుకు కూల్చలేకపోయారంటూ పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి పౌరులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఎయిర్ సర్వేలెన్స్ సిస్టమ్‌లో పాక్ బలహీనమా?

గగన తలంలో యుద్ధ విమానాల కదలికలను పసిగట్టే వ్యవస్థను ఎయిర్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటారు. ప్రతి దేశానికి ఈ వ్యవస్థ ఉంటుంది కానీ.. పాకిస్తాన్ ఎయిర్ సర్వేలెన్స్ సిస్టమ్, జామర్ చాలా బలహీనమైనవి. ఇవి పాతకాలం నాటివి కావడంతో వీటి సామర్థ్యం తక్కువే.

మరోవైపు భారత వైమానిక దళం ఎయిర్ స్ట్రయిక్ కోసం వినియోగించినవి మిరేజ్ 2000 యుద్ధ విమానాలు. ఇవి 1985లో భారత వైమానిక దళంలో చేరాయి. వీటికి భారతీయ వైమానిక దళం ‘వజ్ర’ అని నామకరణం చేసింది. వీటిని దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది.

అవి నిజంగా వజ్రాలే…

మిరేజ్ 2000 యుద్ధ విమానాలు నిజంగా వజ్రాలే. 1999‌లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటినే ఉపయోగించి విజయపతాకం ఎగురవేసింది. సింగిల్ సీట్ ఉండే ఈ విమానంలో తేలికైన చిన్న ఇంజిన్ మాత్రమే ఉంటుంది. ఒక్కో యుద్ధ విమానం బరువు 7500 కిలోలు.

మిరేజ్ 2000 యుద్ధ విమానాలు గంటకు 2,336 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. గగనతలంలో 17 కిలోమీటర్ల పైనుంచి దాడి చేసే సామార్థ్యం వీటి సొంతం. ఈ యుద్ధ విమానాలు లేజర్ గైడెడ్ బాంబులను సులభంగా తీసుకెళ్లి.. గగన తలం నుంచి గగన తలంలోకి, గగనతలం నుంచి భూతలానికి దాడి చేయగలవు.

పాక్‌పై అన్నివేళలా భారత్ నజర్…

మరోవైపు పాకిస్తాన్ వైమానిక దళానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల గురించి భారత్‌కు నిఘా వేయగలిగే సామర్థ్యం ఉంది. దీనికి కారణం భారత్ వద్ద రష్యాలో తయారైన అధునాతన ఎ-50 అవాక్ (ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ టెక్నాలజీ) ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండడమే. భారత వైమానిక దళం 2000 సంవత్సరం ఏప్రిల్‌లో వీటిని కొనుగోలు చేసింది. వీటికోసం భారత్ ఎంతో డబ్బు వెచ్చించింది.

ఈ ఎ-50 అవాక్ ఎయిర్ క్రాఫ్ట్స.. రాడార్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్‌కు అత్యంత కీలకం. ఈ సిస్టం ద్వారా పాక్ గగనతలంపై నిఘా వేసే.. పాక్ ఎయిర్ బేస్‌లో కదలికలను ముందుగానే గుర్తించే సామర్థ్యం భారత వాయుసేన సొంతమైంది. ఫలితంగా పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ ఎక్కడుందో, పాక్ ఆర్మీ ఎక్కడ్నించి మిస్సైళ్లు మోహరిస్తుందో కూడా భారత్‌కు ముందే తెలిసిపోతుంది.

పాకిస్తాన్‌కు చైనాయే దిక్కు…

మరోవైపు రక్షణ అంశాల్లో పాకిస్తాన్‌కు.. అమెరికావైపు నుంచి అందే సహకారం, సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఆగిపోయింది. ఒబామా హయాం చివరలో పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాల అమ్మకం విషయంలో కూడా అమెరికా కాంగ్రెస్ నిషేధం విధించింది.

దీంతో ఇలాంటి విషయాల్లో పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా చైనాపైనే ఆధారపడాల్సిన దుస్థితి. పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్మే దేశాల జాబితాలో చైనా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ ఈ ఎయిర్ సర్వేలెన్స్ అంశాల్లో డ్రాగన్ కంట్రీ నుంచి కూడా ఆ దేశానికి పెద్దగా సహకారం లభించడం లేదు.

భారత్ ముందు బలహీనమే…

పాకిస్తాన్ దగ్గర మొత్తం 1281 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇటు భారత్ దగ్గర 2185 జెట్ ఫైటర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ కూడా అణుశక్తి కలిగిన దేశమే అయినా, చాలా రక్షణ అంశాల్లో భారత్‌తో పోలిస్తే ఆ దేశం చాలా బలహీనంగా ఉందని ఈ రంగంలో నిపుణులే చెబుతున్నారు.

అందుకే భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలు పాక్ గగన తలంలోకి ప్రవేశించి బాంబుల వర్షం కురిపించినా పాకిస్తాన్ వాయుసేన చేష్టలుడిగి చూస్తుండిపోయింది.

ఏం జరిగిందో పసిగట్టేలోపే…

పైడా భారత వైమానిక దళం దాడులు ఎంత పక్కాగా ఉన్నాయంటే, వాటిని పసిగట్టడం కూడా పాకిస్తాన్‌కు సాధ్యం కాలేదు. అంతేకాకుండా, భారత్ చాలా తక్కువ సమయంలో ఈ దాడులు పూర్తి చేసింది. 19 నిమిషాల్లోనే మిరేజ్ 2000 యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి తిరిగి భారత భూభాగంలోకి వచ్చేశాయి.