అమరావతి: ప్రస్తుతం ఏపీలో రాజకీయం రణరంగంలా మారింది. గత కొద్ది రోజుల ముందు వరకు అధికార పార్టీ అయిన టీడీపీ లోకి వలసలు విచ్చలవిడిగా జరిగాయి, కానీ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అధికార పార్టీ నుండి వైసీపీలోకి వలసలు ఎక్కువైపోయాయి.
అధికారం కోసం కొందరు నేతలు, ఆధిపత్యం కోసం కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇకపోతే ఈ మధ్యే టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరిన అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీడీపీ అంటే రాచరిక పాలన…
అసలు విషయానికొస్తే… భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్ పోటీ చేసినా వైఎస్సార్ కాంగ్రెస్‌దే గెలుపు అని అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.
టీడీపీ అంటే ఒక రాచరిక పాలన అని ప్రజలనుకుంటున్నారని, ఐదేళ్లు గుర్తుకురాని ప్రజలు ఇపుడు ఉన్నపళంగా ఎలా గుర్తుకొచ్చారని ప్రశ్నించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై పోరాటమంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ను తిట్టారని, 2019లో కాంగ్రెస్ వారికి శాలువలు కప్పుతూ బీజేపీని తిడుతున్నారంటూ పరోక్షంగా చంద్రబాబును ఆయన విమర్శించారు.
చదవండి: “ఇప్పటికే ఏ-1.. ఇంకా ఎన్ని కేసుల్లో అలా ఉండాలనుకుంటున్నాడో..”








