న్యూఢీల్లీ: సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ‘సందేశాల డిలీట్’ సదుపాయంలో మార్పులు చేస్తోంది. ఇతరులకు పంపిన సందేశాలు వారు చూడకముందే తొలగించేందుకు ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ ఎంతో తోడ్పడుతోంది. ఫీచర్ గత సంవత్సరం ప్రవేశపెట్టారు. పొరపాటున వేరేవారికి లేదా తప్పుడు సందేశాలు పంపినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతోంది. ఇలా సందేశ ఉపసంహరణ సమయం మొదట ఏడు నిమిషాలుగా నిర్ణయించారు. తర్వాత దీన్ని గంట ఎనిమిది నిమిషాల 16 సెకన్లకు పెంచారు. అంటే ఈ సమయంలోపు మన పంపిన సందేశాన్ని డిలీట్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ తాజాగా వాట్సాప్ మార్పులు తీసుకొచ్చినట్లు వాబీటాఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం కొత్తగా సిద్ధం చేసిన బీటా వెర్షన్‌లో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. ఈ తాజా మార్పుల ప్రకారం.. .
సందేశాలు డిలీట్ చేసేందుకు ఎదుటివారికి సందేశం పంపినవారు ఓ అభ్యర్థనను పంపాల్సి ఉంటుంది. దీన్ని 13 గంటల ఎనిమిది నిమిషాల 16 సెకన్లలోపు అవతలి వ్యక్తి ఆమోదించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సందేశాలు డిలీట్ చేయడం అసలు కుదరదు. ఎదుటి వ్యక్తులు ఫోన్ స్విచ్చాఫ్ చేసినప్పుడు ఈ సమయం మించిపోయే అవకాశం ఉందని, ఫలితంగా డిలీట్ సదుపాయం పని చేయదని వాబీటాఇన్ఫో వివరించింది.