చెన్నై: #MeToo ఉద్యమం.. సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లోనే కాదు అన్ని చోట్లా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై సోమవారం విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా స్పందించారు.
ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు రెండు వర్గాల వాదనలు వినాలని, ‘ఈ విషయంలో కేవలం సినీ పరిశ్రమనే టార్గెట్ చేయొద్దు.. వేధింపులు అన్ని రంగాల్లో ఉన్నాయి.. ఫలానా వ్యక్తి కారణంగా తాను సమస్యలు ఎదుర్కొన్నానని ఓ మహిళ చెప్పినప్పుడు సరైన విచారణ చేపట్టాలి..’ అని కమల్ వెల్లడించారు.
సినీ నటి తనుశ్రీ దత్తా బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై చేసిన ఆరోపణలతో మీటూ ఉద్యమం ఉధృతంగా మారింది. ఇలాగే గతంలో కూడా చాలా మంది భారతీయ నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టారు. ప్రస్తుతం సినీ రంగంతో పాటు పలు రంగాలకు చెందిన మహిళలు.. సెలబ్రిటీల చేతిలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బాహాటంగా వెల్లడిస్తున్నారు.
తీవ్రమైన #MeToo ఉద్యమం…
దీంతో ‘మీటూ’ ఉద్యమం తీవ్రంగా మారింది. ప్రభుత్వం స్పందించి ఈ విషయమై ఒక కమిటీ వేసి.. ఇలాంటి వాటికి ఎటువంటి శిక్షలు వేయవచ్చునని ఆ బృందం అధ్యయనం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మీటూని వేదికగా చేసుకొని ఎంతోమంది మహిళలు తమలో ఎన్నాళ్ల నుంచో దాగి ఉన్న ఆవేదనలను, లైంగిక వేధింపులను ధైర్యంగా ముందుకు వచ్చి వివరించడం ఒక కొత్త పరిణామమని కమల్ హాసన్ స్వాగతించారు.
ఇప్పటి వరకు ‘మీటూ’లో సినీ ప్రముఖులు నానా పటేకర్, కైలాశ్ ఖేర్, సాజిద్ ఖాన్, రజత్ కపూర్, సుభాష్ కపూర్, వైరాముత్తు, అలోక్‌నాథ్, , కేంద్రమంత్రి ఎంజే అక్బర్ తదితరుల ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. ఇంకా ప్రముఖులు కాని వారు, చిన్నచిన్న కార్యాలయాల్లో, ఇళ్లల్లో పనిచేసే మహిళలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు.