నిడదవోలు: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వకీల్‌సాబ్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లను కూడా విక్రయించారు.
అయితే, కొత్త చిత్రాల విడుదల సమయంలో ఇప్పటి వరకు కొనసాగిన సంప్రదాయానికి జగన్ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండానే బ్రేకులు వేసింది.
కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రముఖ హీరోల చిత్రాలకు ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించే అవకాశమూ ఉంది. శుక్రవారం వకీల్‌సాబ్ చిత్రం విడుదలకు మొత్తం రంగం సిద్ధమైంది.
అన్ని చిత్రాల మాదిరిగానే దీనికీ ప్రీమియర్ షో, ధరల పెంపునకు అనుమతి ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు. కొంతమంది ఏడో తేదీన ప్రీమియర్ షోల టికెట్లను పలు థియేటర్లలో విక్రయించారు.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటన విడుదల చేశారు. వకీల్‌సాబ్ చిత్రానికి ప్రీమియర్ షోలకు అనుమతి లేదని, టికెట్ల ధరల పెంపునూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ఒకవేళ ఎక్కడా అధిక ధరలకు టికెట్లు విక్రయించి, ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయంతో బెనిఫిట్ షోలు రద్దు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు.
నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అభిమానులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.