

కోల్‌కతా: పెళ్లి మండపానికి వరుడు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో రావడం సాధారణమే. కానీ, తన వివాహానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉండాలని తలచిన ఓ వరుడు ఏకంగా రోడ్డు రోలర్‌పై వివాహ మండపానికి చేరుకున్నారు. అతను చేసిన పనికి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని నదియా ప్రాంతానికి చెందిన ఆర్కా పత్రా అనే వ్యక్తికి.. ఇదే ప్రాంతానికి చెందిన అరుంధతి అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. 29న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ రోజు వరుడు ఓ రోడ్డు రోలర్‌ను అందంగా అలంకరించి దానిపై మండపానికి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రత్యేకంగా ఉండాలని..
అయితే, ఈ వాహనంతో రావడంతో అక్కడ కొద్దిసేపటి వరకు స్వల్పంగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఇది ఇలావుంటే, రోడ్డు వెంట పోయేవారు, అక్కడి స్థానికులు ఫొటోలు, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పోస్టు చేయడం కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
రోడ్డు రోలర్‌ను ఎంచుకోవడంపై వరుడు ఆర్కా పత్రా మాట్లాడుతూ.. తన పెళ్లి వేడుక ఓ జ్ఞాపకంలా మిగిలిపోవాలని, వినూత్నంగా ఉండాలని అనుకున్నట్లు తెలిపాడు. మొదట వింటేజ్ కారులో మండపానికి వద్దామనుకున్నట్లు.. కానీ..అందులో కొత్తేముంది అనిపించిందని… అందుకే ఇలా రోడ్డు రోలర్ అద్దెకు తీసుకున్నట్లు చెప్పాడు.
ఈ విషయంలో తన భార్య కూడా సపోర్ట్ చేసిందని ఆర్కా తెలిపాడు. పెళ్లికి కొన్ని రోజుల ముందే ఈ ఏర్పాట్ల గురించి తనతో మాట్లాడినట్లు తెలిపాడు. ఎలాంటి శబ్ధ కాలుష్యం కాకుండా తాను కేవలం ఓ మృదంగం వాయించే వ్యక్తిని తమ వివాహానికి ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాడు. మొత్తానికి ఈ వరుడు అనుకున్నది సాధించి ప్రత్యేకంగా నిలిచాడు.








