

నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘ప్రణయ్ మళ్లీ పుట్టాడు’అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదట తమ పెళ్లి రోజును పురస్కరించుకుని అమృత తన ఫేస్‌బుక్‌లో ఒక ఫొటోతోపాటు సందేశాన్ని పోస్టు చేశారు.
‘నీకు (ప్రణయ్) మన పెళ్లిరోజు శుభాకాంక్షలు.. మన వివాహమై నేటికి ఏడాది అయ్యింది. గతేడాది ఇదే రోజు నీ చెయ్యి పట్టుకుని నడిచేందుకు ఆత్రుతగా ఎదురుచూసిన సమయం ఇది. ఇప్పుడు మన బిడ్డను నా చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. లవ్‌యూ లల్లు.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను’ అంటూ అమృత భావోద్వేగానికి గురయ్యారు.
కాగా, బుధవారం మధ్యాహ్నమే అమృత మగబిడ్డకు జన్మినిచ్చినట్లు మరో పోస్టు పెట్టారు. దీంతో ప్రణయ్ మళ్లీ పుట్టాడు అంటూ నెటిజన్లు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మనవడిలో తమ కుమారుడు ప్రణయ్‌ని చూసుకుంటామని బాలస్వామి, ప్రేమలత దంపతులు తెలిపారు.
మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృతను అదే పట్టణానికి చెందిన ప్రణయ్ 2018 జనవరి 30న కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో కోపం మారుతీరావు.. ప్రణయ్‌ని హత్య చేయించాడు. ప్రణయ్ హత్య జరిగిన సమయంలో అమృత ఐదు నెలల గర్భిణి. వైద్యులు ఫిబ్రవరి 5న డెలివరీ తేదీ ఇచ్చినప్పటికీ అమృత కోరిక మేరకు బుధవారం ప్రసవం చేసినట్లు తెలిసింది.








