28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం, శవాలను లెక్కించం: ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా

ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం, శవాలను లెక్కించం: ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా

bs dhanoa
- Advertisement -

కొయంబత్తూర్‌: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి చేసి వాటిని ధ్వంసం చేశామని భారత వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా తెలిపారు. అయితే, ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారనేది లెక్కించడం జరగదని స్ఫ్పష్టం చేశారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇటీవల పాకిస్తాన్‌ బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరంపై భారత వాయుసేన మెరుపుదాడి చేపట్టి వందల మంది ముష్కరులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

చదవండి: అభినందన్ శరీరంలో బగ్స్ ఏమీలేవు కానీ, పక్కటెముకలకు గాయాలు…

అయితే ఈ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నదానిపై ఇంతవరకూ స్పష్టమైన సమాచారం లేదు. అటు ప్రభుత్వంగానీ, ఇటు వాయుసేనగానీ మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. ఈ క్రమంలో ఈ దాడిలో అసలు ఎంతమంది చనిపోయారన్నది తాము చెప్పలేమని బీఎస్‌ ధనోవా వ్యాఖ్యానించారు. ఆ వివరాలను ప్రభుత్వమే వెల్లడిస్తుందని చెప్పారు.

లక్ష్యం నెరవేరిందా లేదా అనేదే చూస్తాం…

సోమవారం కొయంబత్తూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఎస్‌ ధనోవా మాట్లాడుతూ.. ‘‘ఎక్కడెక్కడ దాడి చేయాలనే లక్ష్యాలపైనే మా దృష్టి ఉంటుంది. మా పనంతా లక్ష్యం నెరవేరిందా అనేదే చూస్తాం. అంతేగానీ చేసిన దాడుల్లో ఎంతమంది చనిపోయారు అన్నది ఎయిర్‌ఫోర్స్‌ లెక్కించదు. ఈ దాడిలో మా లక్ష్యం నెరవేరింది..’’ అని ధనోవా స్పష్టం చేశారు.

చదవండి: కన్నీటి వీడ్కోలు: ఐఏఎఫ్ పైలట్ అంత్యక్రియలకు యూనిఫాంలో హాజరైన భార్య

అంతేగాక, ‘‘బాలాకోట్‌ ఉగ్రస్థావరాల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్యను వెల్లడించడం వంటివి ప్రభుత్వమే చూసుకుంటుంది. అక్కడ ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. మనం పథకం వేసి దాడి చేసేటప్పుడు నీకు నచ్చిన విమానాలను తీసుకెళతావు.

అదే శత్రువు మనపై దాడి చేసేటప్పుడు ఉన్న విమానాలన్నీ దానిని అడ్డుకోవడానికి రంగంలోకి దిగుతాయి. మన విమానాలకు శత్రువుతో పోరాడే సామర్థ్యం ఉంది..’ అని ఆయన వివరించారు.

అయితే, తాను రాజకీయాలపై స్పందించబోనని అన్నారు. అభినందన్‌ క్షేమంగా స్వదేశానికి రావడం ఆనందంగా ఉందన్నారు. అభినందన్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఆరోగ్యపరంగా ఆయన ఫిట్‌గా ఉంటే త్వరలోనే కాక్‌పిట్‌లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

బాలాకోట్‌ ఉగ్రస్థావరంపై భారత్‌ చేపట్టిన మెరుపుదాడుల్లో 350 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వచ్చినప్పటికీ.. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, బీజేపీ జాతీయాధ్యక్షుడు, ఎంపీ అమిత్ షా మాత్రం 250 మందికి పైగా ముష్కరులను మట్టుబెట్టినట్లు ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

- Advertisement -