
న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఓ ఉగ్రసంస్థ కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ఓ బెదిరింపు లేఖ అందింది.
హిట్ లిస్టులో బీజేపీ వృద్ధ నేత ఎల్‌కే అద్వానీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సహా పలువురు ప్రముఖులు పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆలిండియా లష్కరే తాయిబా హైపవర్ కమిటీ(కోజికోడ్) నుంచి ఈ లేఖ వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రముఖులకు భద్రతను పటిష్ఠం చేశారు. ఈ లేఖ ఒక బూటకమని భావించినప్పటికీ, ముప్పు ఎక్కువగా ఉన్నందున ఎటువంటి అవకాశం తీసుకోకూడదని అధికారులు భావిస్తున్నారు. నవంబర్ 3న భారత జట్టు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ సమయంలో ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న కోహ్లీకి కూడా ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.








