26.2 C
Hyderabad
Wednesday, November 25, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మరో ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

మరో ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త మిషన్‌ను ప్రారంభించింది.నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ) సంస్థతో కలిసి ‘బిల్డ్‌ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.

ఇందులో భాగంగా ప్రభుత్వ భూములను గుర్తించి, భవన సముదాయాలు నిర్మించనున్నారు. మిగతా భూముల్లో మౌలిక వసతులను కల్పించి వాటిని మార్కెట్‌ ధరకు ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను సేకరించనున్నారు. ప్రభుత్వ భూముల వివరాలు అందజేయాలని జాయింట్‌ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ‘బిల్డ్‌ ఏపీ’ మిషన్‌ డైరెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. ఈ అంశంపై నేడు జరగనున్న కేబినెట్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్‌ ప్రాజెక్టుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

ఇప్పటికే విశాఖపట్నంలో ఐఐఎం క్యాంపస్‌ నిర్మాణ పనులను ఎన్‌బీసీసీ దక్కించుకొంది. ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ఇక్కడ తరగతి గదులు, నివాస సముదాయం, పరిపాలన భవనం, గ్రంథాలయం, ప్రయోగశాలలు, క్రీడలు, ఇతర ఉమ్మడి సౌకర్యాలను ఎన్‌బీసీసీ నిర్మించనుంది.

రాష్ట్రంలోని పేదలకు బ్యాంక్‌ రుణం లేకుండా ఉచితంగా ఇల్లు కట్టిఇస్తామని గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. డిసెంబరు నాటికి 9 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని, ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -