25.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక: కాంగ్రెస్ కంచుకోట బద్దలు, టీఆర్ఎస్‌దే గెలుపు…

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక: కాంగ్రెస్ కంచుకోట బద్దలు, టీఆర్ఎస్‌దే గెలుపు…

trs-won-in-huzurnagar-bypoll
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా భావించే వారు. కానీ తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఆ కంచుకోటను టీఆర్ఎస్ బద్దలు కొట్టింది. అది కూడా రికార్డ్ స్థాయి మెజారిటీతో. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 40 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నిక ఫలితాలు గురువారం వెలువడిన సంగతి తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ తదితర పార్టీలు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ.. ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్యనే సాగింది. 

మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రతినిధ్యం వహించారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన ఎంపీగా పోటీ చేసి గెలవడం, ఆ తరువాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఉత్తమ్ మాట మేరకు టిక్కెట్ ఆయన సతీమణి పద్మావతికే కేటాయించింది. కానీ టీఆర్ఎస్ హవా ముందు కాంగ్రెస్ చతికిలపడింది.  ఎన్నికలకు ముందు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేదనే విశ్లేషణలు వినిపించాయి. పోలింగ్‌ రోజు వరకూ అక్కడ ఇదే పరిస్థితి కొనసాగింది.

పోలింగ్‌ రోజున మారిన సమీకరణాలు…

కానీ, పోలింగ్‌ రోజున సమీకరణాలు మారిపోయాయి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. హుజూర్‌నగర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బహిరంగ సభ రద్దయినా, ఓటర్లు మాత్రం టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపారు.

‘ఇప్పటిదాకా కాంగ్రెస్‌ని చూశాం.. ఈసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అవకాశం ఇస్తాం..’ అని బాహాటంగానే హుజూర్‌నగర్‌ ప్రజలు చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ‘అధికార పార్టీని గెలిపిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది.. వేరే ఏ పార్టీ గెలిచినా, ఆ పార్టీలోనే ఆ వ్యక్తి వుంటాడన్న గ్యారంటీ ఏముంది.?’ అని కూడా హుజూర్‌నగర్‌ ప్రజలు ప్రశ్నించారు.

అదే సమయంలో కొందరు మాత్రం, అధికార పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మిగతా విషయాలెలా ఉన్నా, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో టీఆర్‌ఎస్‌ సక్సెస్‌ అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో డీలాపడింది.

ఇక, ఇక్కడ టీడీపీ, బీజేపీల గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదమే. తమ తీర్పుతో హుజూర్‌నగర్‌ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కంగుతినిపించారు. విచిత్రం ఏమిటంటే.. మూడో స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి నిలవడం. మొత్తానికి హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం టీఆర్ఎస్‌కు ఊరట కలిగించేదే.

సంబంధిత వార్తలు

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: గురువారం మధ్యాహ్నం 2 గంటలకల్లా ఫలితం…
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: ఓట్ల లెక్కింపు ప్రారంభం, గెలుపుపై ఎవరికి వారే ధీమా…

- Advertisement -