27.8 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం భారత విజయం: మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ ఆమోదం, కానీ..

భారత విజయం: మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ ఆమోదం, కానీ..

vijay mallya
- Advertisement -

vijay mallya

లండన్: మనదేశంలోని బ్యాంకులకు రూ. 9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశం రప్పించడానికి మరో ముందడుగు పడింది. మాల్యాను భారత్‌కు అప్పగించడానికి అనుమతిస్తూ బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జావిద్ అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు.

మోసం చేసేందుకు మాల్యా కుట్ర పన్నినట్లు అక్రమ నగదు లావాదేవీలు జరిపినట్లు తగిన ఆధారాలున్నాయని విశ్వసించిన మీదట జావిద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని బ్రటన్ హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ ఒప్పుకోవడం భారత పెద్ద విజయంగా చెప్పవచ్చు. కాగా, బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. వీలైనంత త్వరగా మాల్యాను తమకు అప్పగించాలని భారత్ కోరింది.

మాల్యా మోసానికి పాల్పడ్డారన్న భారత్ వాదనలో నిజముందని, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గతంలోనే పేర్కొంది. మాల్యాను భారత్‌కు అప్పగించాలని డిసెంబర్ 10,2018న మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్నోట్ ఆదేశించారు. అయితే, బ్రిటన్ చట్ట ప్రకారం తమ దేశంలో తలదాచుకుంటున్న ఒక వ్యక్తిని మరో దేశానికి అధికారికంగా అప్పగించాలంటే హోంమంత్రి అనుమతించాల్సి ఉంటుంది. అది కూడా కోర్టు తీర్పు వెలువరించిన రెండు నెలల్లోపు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 3న హోంమంత్రి జావిద్ అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు.

పై కోర్టులను ఆశ్రయిస్తే మాత్రం..

అయితే, ఈ విషయంపై ఫిబ్రవరి 4 నుంచి 14రోజులలోగా హైకోర్టును ఆశ్రయించడానికి మాల్యాకు అవకాశం ఉంది. ఇక్కడ కూడా కింది కోర్టు తీర్పే వెలువడితే.. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లవచ్చు. అక్కడ కేసు విచారణ రావడానికి కనీసం 6వారాలు పడుతుంది. విచారణ పూర్తయి తీర్పు రావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. మాల్యా ఇలా కోర్టులను ఆశ్రయించినట్లైతే అతడ్ని స్వదేశానికి తీసుకురావడానికి మరో 8నెలలు పట్టే అవకాశం ఉంది.
ఒక వేళ మాల్యా పై కోర్టులను ఆశ్రయించకుండా ఉంటే.. తొందర్లోనే భారత్‌కు రప్పించే అవకాశం కూడా లేకపోలేదు.

చదవండి: ఇంత అన్యాయమా? చెల్లించాల్సింది రూ.9 వేల కోట్లైతే రూ.13 వేల కోట్లు జప్తు చేస్తారా?: మాల్యా రోదన

- Advertisement -