కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్: బీజేపీలో చేరిన సోనియా ప్రధాన అనుచరుడు టామ్

Tom Vadakkan, key Sonia Gandhi aide, joins BJP, Newsxpressonline
- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, సోనియా గాంధీ ప్రధాన అనుచరుడు టామ్ వడక్కన్‌ గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. జవాన్ల ధైర్య సాహసాలను కాంగ్రెస్‌ కించపరుస్తోందని ఆరోపిస్తూ పార్టీకి ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు.

అందుకే కాంగ్రెస్ పార్టీని వీడా..

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టామ్ వడక్కన్ మాట్లాడారు. ‘సరిహద్దులో అహర్నిశలూ కష్టపడుతున్న మన భద్రతా దళాల నిజాయతీని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఆ పార్టీ చేస్తున్న జాతి వ్యతిరేక విధానాల పట్ల నేను మనస్తాపం చెందాను. అందుకే పార్టీని వీడుతున్నాను’ అని టామ్ స్పష్టం చేశారు.

‘పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మన నేలపై దాడి చేశారు. ఈ విషయంలో మా పార్టీ ప్రదర్శించిన ధోరణి నాకు నచ్చలేదు. ఏ పార్టీ అయినా దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి విధానాలు అనుసరిస్తే దాన్ని మనం ప్రోత్సహించకూడదు. నాకు వేరే దారి లేకపోవడంతో పార్టీని వీడుతున్నాను’ అని ఆయన వెల్లడించారు.

అనంతరం అదే సమావేశంలో వడక్కన్‌ బీజేపీలో చేరారు. రవిశంకర్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత వడక్కన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. కాగా, కాంగ్రెస్‌లో వడక్కన్ వివిధ పదవుల్లో సుమారు 20 సంవత్సరాల పాటు పనిచేశారు. సోనియా గాంధీకి కీలక సహాయకుడిగా వ్యవహరించారు.

 

- Advertisement -