టీడీపీకి రాయపాటి షాక్! పార్టీ అధిష్ఠానంపై అలక, వైసీపీతో మంతనాలు!!

big Shock to TDP, Rayapati is going to the joining YCP , Newsxpressonline

అమరావతి: సీనియర్ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు పార్టీకి ఝలక్ ఇచ్చారు. వైసీపీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయపాటి నర్సరావు పేట నుండి తిరిగి ఎంపీగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. తన కుమారుడికి సత్తెనపల్లి సీటు ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నుండి ఇటు ఎంపీ సీటు పైనగాని, అలాగే రాయపాటి కుమారుడికి సీటు పైనగాని హామీ లభించలేదు. దీంతో రాయపాటి సాంబశివరావు తీవ్ర అసంతృప్తికి లోనవగా, ఆయన్ని బుజ్జగించేందుకు లోకేష్ రంగంలోకి దిగారు.

నర్సరావు పేట సిట్టింగ్ టీడీపీ ఎంపి రాయపాటి సాంబశివ రావు అయిదుసార్లు లోక్‌సభకు.. ఒకసారి రాజ్యసభకు ఎన్ని కయ్యారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న రాయపాటి 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు.  నర్సరావు పేట నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన నర్సరావుపేట సీటు ఆశించారు. అంతేకాకుండా ఈసారి తనతోపాటు తన కుమారుడుకి సత్తెనపల్లి సీటు ఇవ్వాలని కూడా పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఆయన పలు దఫాలు సుదీర్ఘంగా భేటీలు కూడా నిర్వహించారు.

అయితే చంద్రబాబు మాత్రం రాయపాటికి ఎంపీ సీటు విషయంలోగాని ఆయన తనయుడు రంగారావుకు అసెంబ్లీ సీటు కేటాయించే విషయంలోగాని ఎలాంటి హామీ ఇవ్వలేదు. పైపెచ్చు.. నర్సరావుపేట నుండి ఓ విద్యా సంస్థల అధినేత పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. దీంతో రాయపాటి సాంబశివరావు అలకబూనారు. 

వైసీపీ వైపు చూపులు.. రంగంలోకి లోకేష్‌…

తనకు, తన కుమారుడికి సీటు కేటాయింపు విషయంలో రాయపాటి సాంబశివరావు టీడీపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలియగానే వైసీపీ నేతలు టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. వైసీపీలోకి వస్తే ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని వారు చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ రంగంలోకి దిగారు.  రాయపాటితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు సమాచారం. అలాగే రాయపాటిని బుజ్జగించే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి, లగడపాటి రాజగోపాల్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

లోకేష్ స్పందనతో రాయపాటి కూడా మళ్లీ ఆలోచిస్తున్నారని, తనకు న్యాయం జరుగుతుందని.. సీటు కేటాయిస్తారనే నమ్మకం ఉందని చెబుతున్నారట. అయితే, గురువారం రాత్రి వరకు వేచి చూసి.. ఆ తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకుందామని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

‘కోడెల’పై విమర్శనాస్త్రాలు…

తన కుమారుడికి సత్తెనపల్లి సీటు ఆశిస్తున్న రాయపాటి అక్కడి పరిస్థితులపైనా స్పందించారు. కోడెలకు టిక్కెట్ ఇవ్వవద్దని స్థానిక నేతలు చెబుతుంటే ఆయనకే సీటు ఎలా ఇస్తారని రాయపాటి ప్రశ్నించారు. మరోవైపు సత్తెనపల్లిలో సీటు దక్కించుకుని, అసమ్మతి నేతలతో సమస్యలు ఎదుర్కొంటున్న కోడెల శివప్రసాద్ కూడా స్పందించారు.

రాయపాటి తనకు సిట్టింగ్ సీటు ఇవ్వమని కోరితే తప్పు లేదని.. సత్తెనపల్లి సీటు సిట్టింగ్ ఉండగా.. దాన్ని కూడా తన కుమారుడి కోసం అడగడం భావ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఈ విషయంలో తమ పార్టీ అధినేతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే, తనకు అసమ్మతి వెనుక కొందరు నాయకులు ఉన్నారని, వారితో మాట్లాడటానికి కూడా తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. సత్తెనపల్లి నుండి గెలవడమేకాదు.. 15 వేల మెజార్టీ కూడా సాధిస్తానంటూ కోడెల ధీమా వ్యక్తం చేస్తున్నారు.