25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్’కు ఇస్రో సన్నాహాలు, 2022లో ప్రయోగం, ఒక మహిళా వ్యోమగామి కూడా…

ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్’కు ఇస్రో సన్నాహాలు, 2022లో ప్రయోగం, ఒక మహిళా వ్యోమగామి కూడా…

gaganyaan-isro-chairman-sivan
- Advertisement -

gaganyaan-isro-chairman-sivan-1

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయమై శుక్రవారం బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఇస్రో చైర్మన్ కె.శివన్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఇస్రో ప్రస్థానంలో ఈ ‘గగన్‌యాన్’ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారని గుర్తుచేసిన శివన్, దీనిని సాకారం చేసే దిశగా తామంతా శ్రమిస్తున్నామన్నారు.

ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్’ ప్రయోగం 2022లో జరుగుతుందని, అప్పటికి భారత దేశం 75వ స్వాత్రంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుందని, అన్నీ అనుకూలిస్తే అంతకన్నా ముందే ఈ ప్రయోగం జరుగుతుందని, అయితే దానికి ముందుగా రెండు మానవ రహిత అంతరిక్ష యాత్రలు చేపట్టనున్నామని శివన్ వెల్లడించారు.

2020 డిసెంబర్‌ నెలలో మొదటి మానవరహిత అంతరిక్ష యాత్ర ఉంటుందని, 2021 జులై నెలలో రెండో మానవ రహిత అంతరిక్ష యాత్ర ఉంటుందని ఆయన వివరించారు. మొత్తంమ్మీద 2021 డిసెంబర్ లోపు ఈ రెండు మానవ రహిత అంతరిక్ష యాత్రలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గగన్‌యాన్‌ శిక్షణ ఇలా…

ఇక మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన ‘గగన్‌యాన్’కు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించిందని, ఇందులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ అంతా భారత్‌లోనే జరుగుతుందని, అనంతర అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ రష్యాలో ఉంటుందని తెలిపారు.

ఈ యాత్రలో భాగంగా భారత్‌కు చెందిన ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళతారని, ఈ ప్రాజెక్టులో ఒక మహిళా వ్యోమగామికి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నామని శివన్ చెప్పారు.

ఇస్రోలోనే మానవ అంతరిక్ష కేంద్రం…

‘గగన్‌యాన్’ ప్రాజెక్టు కోసం ఇస్రోలోనే మానవ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. ఈ అంతరిక్ష కేంద్రానికి డైరెక్టర్‌గా డాక్టర్ ఉన్నికృష్ణన్ వ్యవహరిస్తారని, అలాగే గగన్ యాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా డాక్టర్ హట్టిన్ వ్యవహరిస్తారని ఆయన వివరించారు. అలాగే ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్యకాలంలో చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని చెప్పారు.

- Advertisement -