సీబీఎస్ఈ బంపర్ ఆఫర్: పదో తరగతి విద్యార్థులకు ఈజీగా మ్యాథ్స్, రెండు స్థాయిల్లో పరీక్ష!

4:13 pm, Fri, 11 January 19
cbse-two-level-maths-exam

న్యూఢిల్లీ: పదో తరగతి చదివే విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2020లో బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోయే పదో తరగతి విద్యార్థుల కోసం మ్యాథమేటిక్స్ పరీక్షల్లో బేసిక్, స్టాండర్డ్ అంటూ రెండు స్థాయిలను పరిచయం చేస్తోంది.

వీటిలో ఏది కావాలో ఎంచుకునే అవకాశం కూడా విద్యార్థులకే కల్పించింది. తొలిసారిగా బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకే ఇలా రెండు స్థాయిల్లో మ్యాథమేటిక్స్‌ను పరిచయం చేస్తోన్నట్లు పేర్కొంది.

చదవండి: ’గేట్‘.. వేసేస్తాం అంటోన్న ఏఐసీటీఈ.. ఆందోళనలో బీటెక్ విద్యార్థులు.. ఏమిటిది? ఎందుకిలా??

అయితే పదో తరగతి మ్యాథమేటిక్స్ కరికులమ్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని.. ప్రస్తుతం ఉన్న చాప్టర్స్, టాపిక్స్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని బోర్డు స్పష్టం చేసింది. సబ్జెక్టుల ఎంపికలో ఆప్షన్స్ ఇచ్చిన మాదిరిగానే.. మ్యాథమేటిక్స్ సబ్జెక్టులోనూ ఆప్షన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది. బోర్డు తీసుకొచ్చిన సరికొత్త మార్పు ప్రకారం.. స్టాండర్డ్ స్థాయిలో ఇప్పుడున్న మ్యాథమేటిక్సే ఉంటుంది.

బేసిక్ స్థాయిలో ఉండే మ్యాథ్స్ మాత్రం ఇంకాస్త సులువుగా ఉంటుంది. అయితే రెండు స్థాయిలకు సిలబస్, క్లాస్ రూమ్ టీచింగ్, ఇంటర్నల్ అసెస్‌మెంటూ అన్నీ సమానంగానే ఉంటాయి.

ఈ కొత్త ప్రయోగం వల్ల పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్ట్‌ను మొత్తంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆఖర్లో తమ తమ సామర్థ్యాన్ని బట్టి ఏ స్థాయిలో పరీక్ష రాయాలన్నది విద్యార్థులు ఎంచుకోవచ్చు అని సీబీఎస్ఈ అధికారి ఒకరు తెలిపారు. పదో తరగతి తరువాత మ్యాథ్స్ వద్దనుకునే విద్యార్థులు.. ఈజీగా ఉండే బేసిక్ లెవల్ మ్యాథ్స్‌ను పదో తరగతిలో ఎంచుకోవచ్చు.

పదో తరగతి తరువాత కూడా మ్యాథ్స్ సబ్జెక్టు ఉండాలని కోరుకునే విద్యార్థులు పదో తరగతిలో స్టాండర్డ్ లెవల్ మ్యాథ్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ రెండు స్థాయిల్లో ఏ రకం మ్యాథ్స్‌ను ఎంచుకోవాలో సంబంధిత ‘స్కూల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్‌’ను సబ్మిట్ చేసే సమయంలోనే చెప్పాల్సి ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా మ్యాథ్స్‌లో ఫెయిలయితే…

బేసిక్ స్థాయి మ్యాథ్స్‌ను ఎంచుకున్న విద్యార్థి ఆ సబ్జెక్టులో గనుక ఫెయిల్ అయితే.. అందులోనే మళ్లీ కంపార్ట్‌మెంటల్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టాండర్డ్ స్థాయి మ్యాథ్స్‌ను ఎంచుకున్న విద్యార్థులు గనుక ఆ పరీక్షలో ఫెయిలయితే.. కంపార్ట్‌మెంటల్ సమయంలో స్టాండర్డ్‌ మ్యాథ్స్‌లోగాని లేదంటే బేసిక్‌ మ్యాథ్స్‌లోగాని పరీక్ష రాయవచ్చు.

ఒకవేళ బేసిక్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు.. పదో తరగతి తరువాత కూడా మ్యాథ్స్‌ను కొనసాగించదలుచుకుంటే కాంపార్ట్‌మెంటల్ పరీక్ష సమయంలో స్టాండర్డ్ స్థాయి మ్యాథ్స్‌ను ఎంచుకోవచ్చు.