ముంబై : మహారాష్ట్రలో దాదాపు 13 మంది మృతికి కారణమైన ఆడ పులి అవని (T1)ని శుక్రవారం రాత్రి కాల్చి చంపినట్లు అక్కడి అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. మహారాష్ట్రలోని యవత్మాల్ ప్రాంతంలో సంచరిస్తూ మనుషుల మాంసం రుచి మరిగిన అవని వల్ల ప్రమాదం పొంచి ఉన్నందున కనిపించిన వెంటనే కాల్చిపారేయలని సుప్రీం కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, అవనిని ప్రాణాలతోనే పట్టుకోవాలంటూ చేంజ్.ఆర్గ్ (change.org) అనే సంస్థ వేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.
13 మందిని బలి తీసుకున్న అవని…
మహారాష్ట్రలోని యవత్మాల్ పరిసర ప్రాంతల్లో సంచరిస్తూ ఆడ పులి అవని దాదాపు 13 మందిని చంపి తిన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇంతమంది మృతికి కారణమైన అవని గత రెండేళ్లుగా అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. ఇప్పటి వరకు ప్రాణలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న యవత్మాల్ పరిసర ప్రాంతాల ప్రజలు అవనిని కాల్చేశారని తెలిసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోని సగం పులులు మన దేశంలోనే…?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల మొత్తం జనాభాలో సగానికిపైగా భారత్‌లోనే ఉందని 2014 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలోని వివిధ అరణ్యాల్లో సుమారు 2,226 పులులు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ప్రతీ ఏడాది దాదాపు 12 పులులు చనిపోతున్నాయని, ఇలా అయితే భవిష్యత్తులో పులుల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని జంతు హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.