కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగనున్నవిజయశాంతి.. ప్రచారంలో పాల్గొననున్న బాలయ్య…!?

star campaigner vijayashanti
- Advertisement -

star campaigner vijayashanti

హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీకి త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా.. కేవలం ప్రచార రథసారథిగానే ఉంటానని సినీ నటి, కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి చెబుతూ వచ్చారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మరో విధంగా ఆలోచిస్తుంది.. విజయశాంతిని తప్పని సరిగా ఈ  ఎన్నికల్లో పోటీకి దించాలని అనుకుంటున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో విజయశాంతి మెదక్ జిల్లా దుబ్బాక నుంచి పోటీ చేస్తారనే వార్తలు ఇటివల జోరుగా వినిపించాయి. అయితే ప్రస్తుతం ఆమెను కూకట్ పల్లి నుంచి పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సీటు నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి ఆసక్తి ప్రదర్శించారు. అయితే, ఆయనను పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది.

పెద్దిరెడ్డికి ఎమ్మెల్సీ సీటు?

పెద్దిరెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని పార్టీ అధినాయకత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఈఅసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేయాలనే ఆలోచనను పెద్దిరెడ్డి విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్ర ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్న కూకట్‌పల్లిలో టీడీపికి విజయం నల్లేరు మీద నడక అనే అభిప్రాయం ఉంది. అయితే, కాంగ్రెస్ అభ్యర్థినిగా విజయశాంతిని కూకట్‌పల్లి సీటు నుంచి పోటీకి దించితే.. ఆ స్థానాన్ని త్యాగం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది.

విజయశాంతి కోసం బాలకృష్ణ ప్రచారం…

అంతేకాదు, ఈ ఎన్నికల్లో విజయశాంతి విజయం కోసం కూకట్‌పల్లిలో ప్రచారం చేయడానికి సినీ హీరో, ఆంధ్రప్రదేశ్ టీడీపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం చేస్తారని అంటున్నారు. బాలకృష్ణ, విజయశాంతి కలిసి చాలా సినిమాల్లో నటించారు. బాలకృష్ణ ప్రచారంతో  విజయశాంతి విజయం మరింత సులభమవుతుందని అంటున్నారు.

- Advertisement -