హైదరాబాద్: తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై శ్రీ పీఠం పీఠాధిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు.
‘వరంగల్‌లోని శివసాయి ఆలయంలో దేవళ్ల సత్యనారాయణ శర్మ అనే పూజారి అనేక రోజుల నుంచి పూజలు చేస్తున్నారు. ఆయన్ని ముస్లిం వ్యక్తి విచక్షణా రహితంగా కొట్టాడు. పూజారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లి నిన్న చనిపోయాడు. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తే ఆయన బతికే వాడు..’’ అని పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, రాష్ట్రంలో ప్రజలకు, ముఖ్యంగా దేవాలయాలకు రక్షణ ఉందా?.. అంటూ ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం దారుస్సలాం కనుసన్నల్లో…
‘‘ముస్లిం వ్యక్తి దాడిలో చనిపోయిన పూజారి అంతిమయాత్రకు వెళ్తే, కేసీఆర్ అక్కడ వందలాది మంది పోలీసులను రంగంలోకి దించారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో రజాకార్ల పాలన కొనసాగుతోందని… దారుస్సలాం (ఎంఐఎం) కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. దారుస్సలాం కనునన్నల్లో కాకుండా, లాల్ దర్వాజ కనుసన్నల్లో ప్రభుత్వం నడవాలని ప్రజలు కోరుకుంటున్నారు..’’ అని స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు.
తెలంగాణ అంటే నిజామే అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నారని పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. జీసన్ పాలన తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రతి హిందువు ఓటు వేయాలని… ఎవరు బాగా పరిపాలిస్తారో వారికే ఓటు వేయాలని కోరారు. బీజేపీకి కులమతాలు ఉండవని స్వామి పరిపూర్ణానంద అన్నారు.