ఇస్లామాబాద్: ఫాదర్ ఆఫ్ తాలిబన్ (తాలిబన్ల పితామహుడి) గా తాలిబన్‌లు భావించే తాలిబన్ మత గురువు మౌలానా సామ్యూల్ హక్ (82) రావల్పిండిలోని అతని నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో హక్ నివాసంలోనే శుక్రవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మౌలానా సామ్యూల్ హక్ గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది.
అతడిపై దాడికి కొన్నిక్షణాల ముందే మౌలానా అంగరక్షకుడు బయటికి వెళ్లాడనీ, అతడు తిరిగొచ్చేసరికి మౌలానా తన గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నాడని మౌలానా కుమారుడు హమిదుల్ హక్ తెలిపాడు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో…
ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు దైవదూషణ చేసిన కేసులో ఒక క్రిస్టియన్ మహిళకు మరణశిక్షను రద్దు చేసిన క్రమంలో దానికి నిరసనగా చెలరేగిన హింసాకాండలో భాగంగానే మౌలానా సామ్యూల్ హక్ హత్య జరిగి ఉంటుందని అతడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మౌలానా హత్యకు బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
దీంతో హక్ మద్దతుదారులు ఇస్లామాబాద్, రావల్పిండిలో విధ్వంసానికి దిగారు. వారు రాషాకాయి టోల్‌ప్లాజాను తగులబెట్టారు. అయితే ఆందోళనకారులను ప్రశాంతంగా ఉండాల్సిందిగా హక్ కుటుంబం విజ్ఞప్తి చేసింది.
మౌలానా సామ్యూల్ హక్ దారుణ హత్యపై, పాకిస్తాన్ అంతర్గత మంత్రి షెహార్ అఫ్రిది, సున్నీ నాయకుడు మౌలానా ఫజల్-ఉర్ రెహ్మాన్, పాకిస్తానీ తాలిబాన్ ఆర్మీ చీఫ్ సహా పలువురు పాకిస్తానీ అధికారులు, మత ప్రముఖులు తమ విచారం వ్యక్తం చేశారు. మౌలానా సామ్యూల్ హక్ కుటుంబ సభ్యులకు తమ ప్రగఢ సానుభూతి ప్రకటించారు.