శ్రీనగర్: ‘ఇక ఆ ఉగ్రవాదులు నన్ను గుర్తుపట్టలేరు..’ తన కుటుంబాన్ని కలవడానికి వెళ్తూ ఉగ్రమూకల నుంచి తప్పించుకోవడానికి తన వేషం మార్చుకున్నసబ్ ఇన్‌స్పెక్టర్ ఆఖరి మాటలివి. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇంతియాజ్ అహ్మద్ మీర్ కుల్గామ్ పట్టణంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా డ్యూటీ చేస్తున్నారు.
అతడికి పోలీసు ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం. అందుకే తన దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ఎంతో నిజాయతీగా డ్యూటీ చేసేవారు. అయితే ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు చాలా ఎక్కువగా ఉండడంతో సెలవులపై ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితి.
ఊరు దాటి వెళితే ఉగ్రవాదులు ఎక్కడ దాడి చేస్తారో? అని ఇంతియాజ్ చాలా రోజులు తన కుటుంబానికి దూరంగా ఉన్నారు. చివరికి అమ్మానాన్నలను చూడాలన్న ఆశ చావక ఎలాగైనా స్వస్థలానికి వెళ్లాలని తన వేషధారణ మార్చుకున్నారు.
ఇలాగైతే ఉగ్రవాదులు తనను గుర్తుపట్టలేరని తోటి ఉద్యోగులకు చెప్పిన ఇంతియాజ్ ఆదివారం సాయంత్రం ప్రభుత్వ వాహనంలో కాకుండా తన సొంత వాహనంలోనే స్వస్థలానికి బయలుదేరారు. కానీ ఎలా కనుక్కున్నారో తెలీదు కానీ ఉగ్రవాదులు ఇంతియాజ్ వాహనాన్ని గుర్తుపట్టి వెంబడించారు.
పుల్వామా జిల్లాలోని వాహిబుగ్ ప్రాంతంలో ఇంతియాజ్‌ను అడ్డుకున్నారు. అతన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు.
‘‘ఎస్సై ఇంతియాజ్‌ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. పుల్వామాలో ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ దారుణమైన సంఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతియాజ్ కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.’..’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విటర్ ద్వారా ధృవీకరించారు. సోమవారం ఉదయం ఇంతియాజ్ భౌతికకాయాన్ని అతని స్వస్థలానికి తీసుకెళ్లారు.