చెన్నై: భారత దేశంలో గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అంటూ ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం ఇప్పటిలో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే కమల్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు లోని హిందువులు తమ నిరసనలని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే మొన్న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కమల్‌పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఇక తాజాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కమల్‌పై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాళ్లు విసిరిన ఇద్దర్నీ కమల్ హాసన్ అభిమానులు చితకబాదబోతుంటే… అడ్డుకున్న పోలీసులు వాళ్లిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: హిందూ ఉగ్రవాది వ్యాఖ్యల ఫలితం: కమల్‌పై చెప్పు విసిరిన ఆందోళనకారులు
ఇక ఈ దాడులపై కమల్ మాట్లాడుతూ… ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా తాను బెదిరేది లేదన్నారు. రాజకీయాల్లో క్వాలిటీ తగ్గిపోతోందన్న కమల్ హాసన్… ఆ బురదలో తాను కొట్టుకుపోదలచుకోలేదని అన్నారు.
అయితే అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు, అతివాదులూ ఉన్నారని చరిత్ర చెబుతోందని తెలిపారు. తాను ముస్లింలు, క్రైస్తవులు, హిందువులకు చేరువవుతున్నానని అన్నారు.
ఇదివరకు కూడా గాడ్సేపై ఇదే అభిప్రాయాన్ని చెప్పానన్నారు. ఈసారి మాత్రమే తన వ్యాఖ్యలు దుమారం రేపాయన్నారు.
తనను అరెస్టు చేస్తారన్న భయం లేదని, తనపై జరుగుతున్న కుట్రల వెనక ప్రభుత్వ హస్తం ఉండి ఉండొచ్చనీ, అందుకే ఈరోజు సులూర్‌లో జరపాలనుకున్న సభకు అనుమతి రద్దు చేశారని విమర్శించారు.








