

సూరత్: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ ఘటనను దేశం యావత్తు తీవ్రంగా ఖండించింది. అమరజవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది. ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణానికి చెందిన ఓ నవ జంట, వారి కుటుంబం మాత్రం తమ నిర్ణయంతో దేశం దృష్టిని ఆకర్షించింది. ఎంతో ఘనంగా తమ పెళ్లి, రిసెప్షన్ చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ జంట, వారి కుటుంబాలు.. ఈ ఉగ్రదాడి ఘటన గురించి తెలిసి తీవ్రంగా చలించి పోయాయి. దీంతో అమరజవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలని తలచి.. దేశం మెచ్చుకునే పని చేశారు.
విందు రద్దు చేసి.. అమరుల కుటుంబాలకు విరాళం
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హష్మేశ్‌బాయి శేఠ్, అజయ్ సంఘ్విలకు వజ్రాల వ్యాపారంలో మంచి పేరుంది. శేఠ్ కుమార్తె అమీనాకు, సంఘ్వి కుమారుడు మీట్ షాకు వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 15న వీరి వివాహం, అనంతరం భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బంధుమిత్రులు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. అయితే పుల్వామా ఉగ్రదాడి గురించి తెలుసుకుని చలించిపోయిన ఈ రెండు కుటుంబాలు విందును రద్దుచేసుకున్నాయి.
ఈ విషయాన్ని మెసేజ్‌ల రూపంలో బంధుమిత్రులు, స్నేహితులకు తెలియజేశాయి. ఈ విందును రద్దు చేసుకోవడం ద్వారా రూ.11 లక్షలు అమరవీరుల కుటుంబాలకు ఇస్తున్నట్లు ప్రకటించాయి. దీనికి అంతా సహకరించారు. ఆఖరికి క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న వారు కూడా అంగీకరించారు. దీంతో పెళ్లిని హిందూ సంప్రదాయం ప్రకారం చాలా సాదాసీదాగా జరిపించారు. రూ.11 లక్షలు అమరవీరుల కుటుంబాలకు, మరో రూ.5 లక్షలు వెల్ఫేర్ ఆర్గనైజేషన్లకు ఇస్తున్నట్లు ప్రకటించాయి ఆ రెండు కుటుంబాలు.
కాగా, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన శేఠ్, సంఘ్వి కుటుంబాలపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మీ మంచి మనసుకు ధన్యవాదాలంటూ స్థానికులు, విషయం తెలిసిన వారు కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ కుటుంబాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తున్నారు.
చదవండి: పాక్ పెద్ద తప్పు చేసింది, భారీ మూల్యం తప్పదు: మోడీ వార్నింగ్, ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ అంటూ…








