ఆధార్‌ చట్టబద్ధమైనదే, ప్రభుత్వ సంస్థలకు ఓకే, ప్రైవేట్‌కు నో: సుప్రీం సంచలన తీర్పు

supreme-court
- Advertisement -

న్యూఢిల్లీ : ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్‌ స్కీమ్‌ రాజ్యాంగపరంగా చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు ప్రకటించింది.  ఆధార్‌పై తొలి తీర్పును జస్టిస్‌ ఏకే  సిక్రీ, చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ చదివి వినిపించారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆధార్‌ ఒక గుర్తింపు అని, మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్‌ ఎంతో విశిష్టమైనదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఆధార్‌ సేవలను ప్రజాప్రయోజనాల కోసమే  తీసుకొచ్చారని, డూప్లికేట్‌ ఆధార్‌ పొందడం అసాధ్యమని  చెప్పారు.

దేశ ప్రజలకు జారీ చేసిన ఆధార్‌ సంఖ్యతో పౌరుల ప్రాథమిక హక్కు అయిన గోప్యతకు భంగం కలుగుతోందంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్ చట్టబద్ధత అంశంపై గతంలో పలు వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్‌పై తీర్పును గత నాలుగు నెలలుగా  రిజర్వులో ఉంచింది. చివరికి మంగళవారం ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తన కీలక తీర్పును వెలువరించింది.

తీర్పు వివరాలు ఇలా…

  • వ్యక్తిగత స్వేచ్చకు ఆధార్‌ అవరోధం కాదు. ఆధార్‌ అధికారిక ప్రక్రియను, వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచాలి.  ప్రభుత్వ సంస్థలు ఆధార్‌ డేటా షేర్‌ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. షేర్‌ చేసిన ఆధార్ డేటాను ఆరు నెలల లోపు తొలగించాలి.  ప్రైవేట్‌ సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం కుదరదు.
  • ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లకుండా చూడాలి.  సమాచార భద్రత కోసం చట్టం తీసుకురావాలి.  ఆధార్‌ ప్రక్రియ స్వచ్ఛందంగా కొనసాగాలి
  • టెలికాం కంపెనీలు ఆధార్‌ అడగరాదు.  ఇప్పటి వరకు సేకరించిన యూజర్ల ఆధార్‌ నెంబర్లను టెలికాం కంపెనీలు తొలగించవచ్చు.
  • బ్యాంక్‌ సేవలకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి కాదు.  అలాగే స్కూల్‌ అడ్మినిషన్లకు ఆధార్‌ తప్పనిసరి కాదు.
  • పాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులకు మాత్రం ఆధార్‌ తప్పనిసరి.  సీబీఎస్‌, నీట్‌, యూజీసీకి ఆధార్‌ తప్పనిసరి కాదు.  అక్రమ వలసదారులకు ఆధార్‌ అవసరం లేదు.

- Advertisement -