నల్గొండ: ప్రణయ్ హత్య విషయంలో సామాజిక న్యాయం కోసం సోషల్ మీడియా వేదికగా పోరాటం మొదలుపెట్టారు ఆయన భార్య అమృత. ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేరిట ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేశారు.‘ప్రణయ్ ఇప్పుడు ఒంటరి కాదు. నాతోపాటు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడు..’ అంటూ అమృత తొలి పోస్టు చేసింది.
మిర్యాలగూడను ఒక సామాజికవర్గం తమ అడ్డాగా మార్చుకుందని, అది ఏ ఒక్క వర్గానికో పరిమితమైన అడ్డా కాదని నిరూపించాలంటే ప్రణయ్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాల్సిందేనని ఆమె అంటున్నారు. ఇప్పుడీ పేజీని అందరూ లైక్ చేసి షేర్ చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ టాపిక్కే ఫేస్‌బుక్ ని కుదిపేస్తోంది. కుల పిచ్చి పట్టిన మారుతీరావు.. పరువు కోసం ప్రణయ్‌ను దారుణంగా చంపేశాడని.. అతన్ని.. హత్య కుట్రలో పాల్గొన్న అందరినీ కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో ఇప్పటికే జనం డిమాండ్ చేస్తున్నారు. ఇపుడు ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు అన్ని వర్గాల మద్దతు దొరుకుతోంది.
అదే పేరుతో మరిన్ని ఫేస్‌బుక్ పేజీలు?
అయితే ఓ కొత్త సమస్య వచ్చి పడింది. అదేమిటంటే.. ఈ పేజీని అనుసరిస్తూ.. అనుకరిస్తూ.. ఇదే పేరు, ఇదే లుక్ తో చాలా పేజీలు క్రియేట్ అయ్యాయి. కొన్నిటిలో నెగిటివ్ పోస్ట్ లు కూడా పెడుతున్నారు. ఆ ఫేస్ బుక్ పేజీలను నిరోధించాల్సిన అవసరం ఉంది.